అంతర్జాతీయ ఉగ్రవాది నోట వేదాంతమూ..వైరాగ్యమూ !
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన 56 ఏళ్ల మసూద్ అజార్ నోట వేదాంతమూ వైరాగ్యం తన్నుకుని వస్తోంది.
By: Tupaki Desk | 8 May 2025 1:00 AM ISTఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన 56 ఏళ్ల మసూద్ అజార్ నోట వేదాంతమూ వైరాగ్యం తన్నుకుని వస్తోంది. భారత్ మీద గత మూడు దశాబ్దాలుగా అనేక రకాలుగా ఉగ్ర దాడులకు స్కెచ్ గీసి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న మసూజ్ అజాద్ కి ఇపుడు తన సొంత వారు సోదరి బావ మేనకోడలు పిల్లలు భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడిలో మరణించడంతో దుఖం దొర్లుకుంటూ వస్తోంది.
తాను పెంచి పోషించిన తాను ఆవహింప చేసుకున్న ఉగ్ర భూతమే తన కుటుంబాన్ని కాటు వేసిందని ఇంకా మసూద్ అజార్ తెలుసుకోలేకపోవడం విషాదమే. తన వారు అంత అల్లా వద్దకు అతిధులుగా వెళ్ళిపోయారు అని ఆ బృందంలో తాను కూడా ఎందుకు లేను అని బాధపడుతున్నాను అని ఆయన అన్నట్లుగా పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది.
తన వారు అంతా పోయాక తాను ఉండి ఎందుకు అని మసూజ్ అజార్ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో ఆయన భారత్ మీద మోడీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక చూస్తే కనుక పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంలోని జామియా మసీద్ సుభాన్ అల్లాపై జరిగిన దాడులలో మసూజ్ అజార్ పెద్ద సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు.
తన బంధువుల నిష్క్రమణకు సమయం ఆసన్నమైంది అని అంటూనే వారిని అల్లా చంపలేదని మసూజ్ అజార్ పెర్కొన్నారని తెలుస్తోంది. ఇక మసూజ్ అజార్ గురించి చూస్తే కనుక 1994లో భారత్‌లో అరెస్టయి అనంతరం ఎయిర్ ఇండియా ఐసీ 814 విమానం హైజాక్ ఘటన తర్వాత విడుదలై పాక్ లో ఉంటున్నాడు. అతను జైలులో ఉన్నాడని ఎన్నో అబద్ధాలు ఆడిన పాక్ ఆయనకు రాచ మర్యాదలు చేస్తూ జనవాసాలు ఉన్న చోటనే అపరిమితమైన భద్రతను కల్పిస్తూ వస్తోంది.
బయట ప్రపంచానికి మాత్రం అతనితో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఇలా పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడానికి భారత్ మీద ఉగ్ర మూకలను ఎగదోయడానికి మసూజ్ అజార్ ప్రధాన కారణంగా చెప్పాలి. ఈ రోజున తన వారు తన రక్తం అని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్న మసూజ్ అజార్ కి భారత్ లోని ఉగ్రదాడులకు స్కెచ్ గీసి అమాయకులను పొట్టన పెట్టుకున్నపుడు ఆ భాద ఏమిటో తెలియదా అని నెటిజన్లు అంటున్నారు.
నరేంద్ర మోడీ మీద భారత్ మీద రగులుతున్న ఈ అంతర్జాతీయ ఉగ్రవాది నిజంగా తన బంధువుల బృందంలో ఉండి పైలోకాలకు పయనం కట్టాల్సినదే అని అంటున్నారు. కానీ ఎక్కడో మిస్ అయి ఈ రోజున భారత్ మీద ప్రతీకారం అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
భారత్ మీద దాడి అన్న మాట మరచిపోతే ప్రశాంతగా మసూజ్ అజార్ తన జీవితాన్ని కొనసాగించడానికి వీలు ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా పాత పద్ధతులతో భారత్ మీద ఎటాక్ చేయాలని చూస్తే కనుక రానున్న పరిణామాలకు ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
తనదాకా వస్తే కానీ తెలియదు అని అంతా అంటారు. ఈ రోజున తన వారు కళ్ళ ముందు విగతజీవులుగా ఉండడం వల్లనే మసూజ్ అజార్ లో వైరాగ్యం వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఘటనపై తనకు ఎలాంటి విచారం గానీ, నిరాశ గానీ లేదని ఈ కరడు కట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది అంటున్నాడు అంటే భారత్ మరింత జాగ్రత్త వహించాల్సి ఉంది. అలాగే గట్టి నిఘా పెట్టి మసూద్ అజార్ పని పట్టాల్సి ఉందని సూచిస్తున్నారు.
