ఆ జిల్లా వాసుల కోరిక తీరుస్తున్న బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకుని మరీ ఈసారి అమలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
By: Tupaki Desk | 20 May 2025 11:14 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకుని మరీ ఈసారి అమలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. బాబు మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన హామీలు ఇస్తారు కానీ సరిగ్గా అమలు చేయరని. అయితే బాబు హామీలను చేస్తారు కానీ జనాల ఊహల మేరకు కాదు తాను అనుకున్న తీరులోనే. అందుకే అవి హామీలను నెరవేర్చినవిగా ఎవరూ చూడరు.
అయితే చంద్రబాబు ఈసారి మాత్రం పట్టుదల మీద ఉన్నారు. కాస్తోఅ ముందో వెనకాలో హామీలను పూర్తిగా నెరవేర్చాలని కంకణం కట్టుకున్నారు. అలా బాబు ఒక జిల్లా వాసుల సుదీర్ఘమైన డిమాండ్ ని నెరవేరుస్తున్నారు. వారు ఎప్పటి నుంచో కోరుకున్న దానిని తీర్చి మరీ తీపి తాయిలాన్ని వారి చేతిలో పెట్టబోతున్నారు.
ఇంతకీ ఏమా జిల్లా ఏమా తాయిలం అంటే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వాసుల కధ అది. మార్కాపురానికి ఒక ప్రత్యేక జిల్లాగా చేయాలని దశాబ్దాల నుంచి అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా విడిపోయింది 1970 దశకంలో అప్పుడే తమకంటూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా కావాలని ఆ ప్రాంతీయులు గట్టిగా కోరారు.
ఇక 1978లో విజయనగరం జిల్లా ఏర్పాటు తరువాత మళ్ళీ ఉమ్మడి ఏపీలో కొత్త జిల్లా అన్నది ఏర్పాటు చేయలేదు 2022లోనే తిరిగి అది సాధ్యమైంది వైసీపీ అయితే ఏకంగా పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కచ్చితంగా మార్కాపురం కేంద్రంగా జిల్లా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ఊసే లేకుండా వైసీపీ జిల్లాల పునర్ విభజనను ముగించింది.
దాంతో వైసీపీ మీద తీవ్ర అసంతృప్తితో జిల్లా వాసులు రగిలిపోయారు. సరిగ్గా దానినే పట్టుకున్న టీడీపీ తాము కనుక అధికారంలోకి వస్తే కొత్త జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు సైతం అనేక సార్లు ఈ హామీ ఇచ్చారు. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకోవడానికి బాబు చూస్తున్నారు.
దాంతో టీడీపీ ఎన్నికల హామీ మేరకు మార్కాపురం కొత్త జిల్లాగా తొందరలో అవతరించనుంది అని అంటున్నారు. మార్కాపురం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉంది మార్కాపురం ఒక పట్టణంగా ఉంది. అలాగే రెవిన్యూ డివిజన్ గా ఉంది. ఇంకా చూస్తే మండల కేంద్రంగానూ ఉంది.
దాంతో మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. దీంతో కొత్త జిల్లాకు అన్ని విధాలుగా హంగులు ఆర్భాటాలు వస్తాయని భావిస్తున్నారు. బాబు ఈ హామీ నెరవేర్చడం ద్వారా ఆ జిల్లా వాసులకు తాను కలకాలం గుర్తుండేలా చేసుకుంటున్నారు అని అంటున్నారు.
