ఏమిటీ 'ప్రొమెథియస్'? ఫేస్ బుక్ జుకర్ తాజా ప్రాజెక్టు లక్ష్యమేంటి?
ఏఐను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు ఆయన ఏఐ సూపర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నడుం బిగించారు.
By: Tupaki Desk | 17 July 2025 10:30 AM ISTటెక్నాలజీ పరంగా దూసుకెళ్లే ప్రాశ్చాత్య కంపెనీలతో మనం ఎందుకు పోటీ పడలేమన్న సందేహం కొందరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. భవిష్యత్తును.. భవిష్యత్ అవసరాల్ని గుర్తించటం.. అందుకుఅవసరమైన సాంకేతిక అంశాలపై భారీగా పెట్టుబడులు పెట్టే కంపెనీలు మన వద్ద లేకపోవటం కూడా దీనికి కారణం. అస్సలు లేవా? అంటే.. ఉన్నాయి. కానీ.. ఫేస్ బుక్.. గూగుల్.. మైక్రోసాఫ్ట్ రేంజ్ లో ఖర్చు చేసే శక్తిసామర్థ్యాలు మన దేశ కంపెనీలకు లేదని చెప్పాలి. అదెంత భారీగా ఉంటుందో తెలిసేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తాజా ప్రాజెక్టు దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ప్రపంచ గతిని పూర్తిగా మార్చేసే ఏఐ రంగం గురించి.. అందులో పలు సంస్థలు ఇప్పటికే సాధించిన విజయాల గురించి చూస్తున్నదే. ఈ రంగంలో తోపులుగా చెప్పే ఓపెన్ ఏఐ.. డీప్ సీక్ లాంటి వారికి గట్టిపోటీ ఇచ్చేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు కం మెటా సీఈవోగా వ్యవహరిస్తున్న మార్క్ జుకెర్ బర్గ్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టు ‘ప్రొమెథియస్’. దీనికి సంబంధించిన కీలక పరిణామం వచ్చే ఏడాదిలో జరగనుంది. ఇంతకూ ఆయన ఏం చేస్తున్నారు? ఈ ప్రాజెక్టు కోసం ఆయన చేస్తున్న ఖర్చు లెక్క తెలిస్తే.. నోట మాట రాదంతే.
ఏఐను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు ఆయన ఏఐ సూపర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నడుం బిగించారు. ఆయన వచ్చే ఏడాదికి ఏర్పాటు చేస్తున్న ఏఐ సూపర్ క్లస్టర్ల సైజు ఏకంగా 1341 మెగావాట్లు కావటం విశేషం. ఇంతకూ ఈ ఏఐ సూపర్ క్లస్టర్లు ఏంటి? అన్న సందేహం రావొచ్చు. దాని గురించి పూర్తిగా తెలిస్తే.. జుకెర్ భారీ ప్లానింగ్ ఇట్టే అర్థమవుతుంది. వచ్చే ఏడాది పడే మొదటి అడుగు (1341 మెగావాట్లు)ను ఆయన ఎక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారంటే.. 5వేల గిగావాట్ల వరకు.
ఇంతకూ ఈ సూపర్ క్లస్టర్లు ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. జుకెర్ భారీ ప్రాజెక్టు స్థాయి ఇట్టే అర్థమైపోతుంది. ఏఐ అదేనండి కృత్రిమ మేధ ఎలా పని చేస్తుందో అందరికి తెలిసిందే. అయినా.. మరోసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మనం సాధారణంగా ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతికితే.. గూగుల్ లో సెర్చ్ చేస్తే.. దానికి సంబంధించిన సమాచారం రావటం.. ఆ లింకుల్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ పనికి వచ్చే డేటాను తీసుకొని మొత్తంగా మనకు అవసరమైన వాటిని తీసుకొని క్రోడీకరిస్తే మన పని అయ్యేది. ఏఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గతానికి భిన్నంగా మనకు అవసరమైన అంశాన్ని అడిగినంతనే చాట్ జీపీటీ కావొచ్చు డీప్ సీక్ కావొచ్చు మరో వేదిక ఏదైనా కావొచ్చు. కన్నుమూసి తెరిచే లోపు సమాచారాన్ని మన కళ్ల ముందుకు తీసుకురావటం తెలిసిందే.
ఆయా వేదికలు అంత వేగంగా పని చేయటం వెనుక ఉన్నవే సూపర్ క్లస్టర్లు. ఇవి నేరుగా సమాచారాన్ని వేగంగా సేకరించవు కానీ.. ఎలా సేకరించాలో ఏఐ మోడల్స్ కు రోజులు.. వారాలు.. నెలల తరబడి ట్రైనింగ్ ఇస్తాయి. ఇలా ట్రైనింగ్ ఇవ్వటం మనుషులకు సాధ్యం కాదు కాబట్టి.. సూపర్ క్లస్టర్లను వినియోగిస్తారు. డీప్ సీక్ మోడల్ కు ట్రైనింగ్ ఇవ్వటానికి ఉపయోగిస్తున్న సూపర్ క్లస్టర్ సామర్థ్యం కేవలం 12 నుంచి 14 మెగావాట్లు. అదే చాట్ జీపీటీ సూపర్ క్లస్టర్ సామర్థ్యం 300 - 500 మెగావాట్లు.
దీనికి రెండున్నర రెట్లు అధిక సామర్థ్యంతో ఏకంగా 1341 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్లస్టర్ ఏర్పాటుకు జుకెర్ బర్గ్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై రంగంలోకి దిగటమే కాదు.. వచ్చే ఏడాది నాటికి 1341 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సూపర్ క్లస్టర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం పెడుతున్న పెట్టుబడులు అక్షరాల లక్షల కోట్ల రూపాయిలుగా చెబుతున్నారు. వచ్చే ఏడాదికి 1341 మెగావాట్ల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. ఈ ప్రాజెక్టు చివరి నాటికి 5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సూపర్ క్లస్టర్ నిర్మాణాన్ని పూర్తి చేయటమే లక్ష్యమని చెబుతున్నారు. అంటే ఇప్పుడు షురూ చేసిన ప్రొమెథియస్ కంటే ఐదురెట్ల ఎక్కువ సామర్థ్యమన్న మాట. దీంతో.. డేటా వాయు వేగం కంటే ఎక్కువ వేగంతో అందుబాటులోకి రానుంది.
మరింత సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే జుకెర్ డెవలప్ చేస్తున్న సూపర్ క్లస్టర్ సామర్థ్యం 1341 మెగావాట్లు ఎంత వేగం? అన్న దానికి అందరికి తెలిసిన అంశాల్ని ఉదాహరణగా చెబితే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. మన ఇంట్లో తిరిగే సీలింగ్ ఫ్యాన్ సగటున 75 వాట్ల కరెంట్ ను వినియోగించుకుందంటే.. ఒకేసారి 1.8 కోట్ల ఫ్యాన్లు తిరిగితే ఎంత శక్తి ఖర్చు అవుతుందో.. జుకెర్ పూర్తి చేయాలనుకుంటున్న మొదటి అడుగు సామర్థ్యం ఆ స్థాయిలోనిది. ఈ శక్తితో ఒకేసారి 1.34 కోట్ల టీవీల్ని ఒకేసారి చూడటం.. 89.4 లక్షల ఫ్రిజ్ లు.. 6.7 కోట్ల ట్యూబ్ లైట్లనుపని చేయించొచ్చు. 1341 మెగవాట్లకే అంత శక్తి ఉంటే.. ఈ ప్రాజెక్టు చివరకు చేరాలనుకున్న లక్ష్యమైన 5 గిగావాట్లు అంటే.. అదెంత పవర్ ఫుల్ అన్నది మీ అంచనాకే వదిలేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ప్రపంచ గతిని మార్చే సంస్థలుగా కొన్నింటిని ఎందుకు చెబుతారో?
