ఏపీలో మావోయిజం క్లోజ్.. లొంగిపోయిన ఏకైక నేత
ఆంధ్రప్రదేశ్ అడవుల్లో దశాబ్దాల పాటు అలజడి సృష్టించిన విప్లవ పోరాటానికి తెరపడింది. రాష్ట్రంలో మిగిలి ఉన్న మావోయిస్టు పార్టీ ఏకైక నేత చెల్లూరి నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 30 March 2026 2:26 PM ISTఆంధ్రప్రదేశ్ అడవుల్లో దశాబ్దాల పాటు అలజడి సృష్టించిన విప్లవ పోరాటానికి తెరపడింది. రాష్ట్రంలో మిగిలి ఉన్న మావోయిస్టు పార్టీ ఏకైక నేత చెల్లూరి నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా పరిసమాప్తమైందని చెప్పవచ్చు. కేంద్రం నిర్దేశించిన 'మావోయిస్టు విముక్త భారత్' లక్ష్యానికి ఈ పరిణామం ఒక బలమైన ముగింపును ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో విప్లవోద్యమం సాగింది. శ్రీకాకుళం అడవుల్లో నక్సల్ బరీ ఉద్యమంగా మొదలై ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూపుగా కొనసాగి చివరికి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన విప్లవోద్యమం ఆపరేషన్ కగార్ కారణంగా ముగిసిందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేత చెల్లూరి నారాయణరావు, ఆయన దళంలోని 8 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ప్రకటించారు. వీరి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. అయితే నారాయణరావు పోలీసులతో టచ్ లో ఉన్నారని, ఆయన సోమవారం లొంగిపోతారని కొన్ని పత్రికల్లో ముందే కథనాలు వచ్చాయి. కానీ, డీజీపీ మాత్రం నారాయణరావు లొంగుబాటు చెప్పకుండా, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఏదిఏమైనా నారాయణరావుతోపాటు 8 మంది దళ సభ్యులు ఉద్యమాన్ని వీడటంతో ఏపీలో మావోయిస్టు పార్టీ పూర్తిస్థాయిలో పతనమైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన చెల్లూరి నారాయణరావు 35 ఏళ్లుగా అజ్ఙాతంలో ఉన్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలు లొంగిపోవడం, కొందరు ఎన్ కౌంటర్లలో మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో నారాయణరావు దళం మాత్రమే మిగిలింది. దీంతో ఆయన లొంగుబాటు కోసం ఏపీ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని చెబుతున్నారు. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటరు, ఆ సమయంలో విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టులను అరెస్టు చేసిన తర్వాత నారాయణరావు కూడా లొంగిపోవాలని ప్రయత్నించారని చెబుతున్నారు.
ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటుకు ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో నారాయణరావు లొంగుబాటుపై తీవ్ర తర్జనభర్జన కొనసాగింది. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రకటించారు. అంతేకాకుండా ఏపీని నక్సల్స్ ఫ్రీ స్టేట్ గా ప్రకటించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా ఉండేది. ఉత్తరాంధ్ర అడవుల నుంచి నల్లమల కొండల వరకు వారి ప్రాబల్యం విస్తరించి ఉండేది. పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) కాలం నుండి నేటి మావోయిస్టుల వరకు ఎందరో కీలక నేతలు ఇక్కడి నుంచే దేశవ్యాప్త ఉద్యమాలను నడిపించారు.
అయితే, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాల ఉక్కుపాదం, గ్రేహౌండ్స్ దళాల వ్యూహాలు, అభివృద్ధి పథకాలు వారి ఉనికిని క్రమంగా దెబ్బతీశాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఆపరేషన్ కగార్' చేపట్టి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. మావోయిస్టులు విస్తరించిన అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేయడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో వారి నెట్‌వర్క్‌ను ఛేదించడంపై వ్యూహాత్మకంగా పావులు కదిపింది. దీంతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నుంచి దళ సభ్యులు వరకు అంతా ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా చేసిందని అంటున్నారు.
