Begin typing your search above and press return to search.

సంచలనం : సీఎం పదవికి రాజీనామా చేయను.. మమత బెనర్జీ తిరుగుబాటు..

By:  Tupaki Desk   |   5 May 2026 5:15 PM IST
సంచలనం : సీఎం పదవికి రాజీనామా చేయను.. మమత బెనర్జీ తిరుగుబాటు..
X

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తన రాజీనామా ఊహాగానాలకు తెరదించారు. ఈ ఎన్నికల ఫలితం ప్రజల తీర్పు కాదని.. ఇది వ్యవస్థాగతమైన కుట్ర అని ఆమె అభివర్ణించారు.

రాజీనామా ప్రసక్తే లేదు.. దీదీ స్పష్టీకరణ

ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని కరాఖండిగా చెప్పారు. "మేము ఓడిపోలేదు.. మమ్మల్ని ఓడించారు. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన తీర్పును గౌరవిస్తాం కానీ, అక్రమాలతో కూడిన ఫలితాన్ని అంగీకరించం" అని ఆమె ఉద్ఘాటించారు. తనపై ఒత్తిడి తెచ్చి పదవి నుండి తప్పించాలని చూస్తున్న శక్తులకు లొంగే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

ఈసీ, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు

ఎన్నికల కమిషన్ తీరుపై మమతా నిప్పులు చెరిగారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఎన్నికల కమిషన్ తొత్తుగా మారిందని ఆమె ఆరోపించారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని.. దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారని, తాము న్యాయపోరాటం చేస్తే 32 లక్షల పేర్లను మాత్రమే పునరుద్ధరించారని ఆమె తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సుమారు 100 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసి.. బలవంతంగా తమ గెలుపును లాక్కున్నారని ఆమె వాపోయారు. తాము కేవలం ఒక రాజకీయ పార్టీతోనే కాకుండా ప్రధానమంత్రి, హోంమంత్రి కార్యాలయాలు , మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో పోరాడాల్సి వచ్చిందని మమతా పేర్కొన్నారు.

ఇండియా కూటమి మరింత బలోపేతం

బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతాయన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియా అలయన్స్ నేతలందరూ తనకు అండగా నిలిచారని ఆమె తెలిపారు. "సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ వంటి అగ్రనేతలు నాకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ కుట్ర మా ఐక్యతను దెబ్బతీయలేదు సరే కదా, ప్రతిపక్షాలను మరింత బలోపేతం చేస్తుంది" అని మమతా ధీమా వ్యక్తం చేశారు.

'నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్‌ను'

అధికార పదవుల పట్ల తనకు వ్యామోహం లేదని మమతా మరోసారి స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా తాను ఒక్క రూపాయి జీతం కానీ, పెన్షన్ కానీ తీసుకోలేదని గుర్తు చేశారు. "నేను ఇప్పుడు ఒక స్వేచ్ఛా పక్షిని. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేయడం నాకు తెలుసు. ఒక సాధారణ వ్యక్తిగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాను" అని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు బెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రక్రియపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు రానున్న రోజుల్లో న్యాయపరమైన, రాజకీయ పరమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అపజయాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు ధోరణితో ముందుకు సాగుతున్న 'బెంగాల్ టైగర్' వైఖరి భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.