Begin typing your search above and press return to search.

మహేష్ బాబాయిని అక్కడనుంచి బరిలోకి దించబోతున్నారా?

ఈ నేపథ్యంలో మహేష్ బాబు బాబాయ్ ఘట్టమ‌నేని ఆదిశేష‌గిరిరావు టీడీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:48 AM GMT
మహేష్  బాబాయిని అక్కడనుంచి బరిలోకి దించబోతున్నారా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. పైగా ఇప్పుడు జరుగుతున్నవి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు... యుద్ధం అనే మాటలు వినిపిస్తున్న వేళ... ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ ఎంత ప్రతిష్టాత్మకం అనేది స్పష్టమవుతుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.

అవును... 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వ‌రుస‌గా గుంటూరు ఎంపీగా గెలిచిన మ‌హేష్‌ బాబు బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు బాబాయ్ ఘట్టమ‌నేని ఆదిశేష‌గిరిరావు టీడీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిశేషగిరి రావు పేరును బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేష‌గిరిరావు ఎప్పటి నుంచో రాజ‌కీయాల్లో ఉన్నారు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలపై బాగా ఆసక్తి ఉందని అంటుంటారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీ టిక్కెట్ ఆశించారని చెబుతారు. అయితే ఆశించిన టిక్కెట్ దక్కలేదనో ఏమో కానీ అనంతరం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ లోనూ పనిచేశారు.

కాగా... పెన‌మ‌లూరు నియోజకవర్గంలో టీడీపీ మంచి పట్టుందని చెబుతారు. ఇదే సమయంలో అక్కడ టీడీపీ సీటు కోసం నేతల మధ్య గ‌ట్టి పోటీ కూడా ఉంది. ప్రస్తుత ఇన్‌ చార్జ్‌ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఉండగా... మైల‌వ‌రం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జ‌రుగుతోంది. ఈ సమయంలో ఆదిశేష‌గిరిరావు పేరు తెరపైకి వచ్చింది.

వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా ఇదే టిక్కెట్ ఆశించారు. అయితే ఆయనను నూజివీడు ఇన్ ఛార్జ్ గా పంపించారు చంద్రబాబు. ఈ సమయంలో... టీడీపీ అధినాయ‌క‌త్వం పెనమలూరు విషయంలో సరికొత్త ఆలోచన చేస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆదిశేష‌గిరిరావు ఇక్కడ పోటీ చేస్తే మ‌హేష్‌ బాబు అభిమానులు స‌పోర్ట్ చేస్తార‌న్న ఆశ‌లు చంద్రబాబుకు ఉన్నాయని అంటున్నారు.