Begin typing your search above and press return to search.

కుడా.. పడా.. గడా.. ‘కడా’.. సీఎంల నియోజకవర్గాలకు మహర్దశ

డ్రిప్ ఇరిగేషన్ కు పైలట్ ప్రాజెక్టుగా కుప్పంను ఎంపిక చేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉండే కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనీ ఏర్పాటు చేశారు

By:  Tupaki Desk   |   31 Dec 2023 11:28 AM GMT
కుడా.. పడా.. గడా.. ‘కడా’.. సీఎంల నియోజకవర్గాలకు మహర్దశ
X

తెలుగు రాష్ట్రాల్లో 294 అసెంబ్లీ సీట్లుండగా.. వీటిలో రెండింటికి మాత్రమే సీఎంలను అందించే భాగ్యం ఉంటుంది. అవి ఏ రెండైనా కావొచ్చు. గత 30 ఏళ్లలో చూస్తే టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహించిన కుప్పం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంచుకోట పులివెందుల, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన గజ్వేల్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీరందరూ ముఖ్యమంత్రులు అయ్యాక తమ నియోజకవర్గాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పం దశ మారిందనే చెప్పాలి. అప్పట్లోనే ఆయన ముందుచూపుతో కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేశారు. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఇజ్రాయెల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. డ్రిప్ ఇరిగేషన్ కు పైలట్ ప్రాజెక్టుగా కుప్పంను ఎంపిక చేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉండే కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనీ ఏర్పాటు చేశారు. తద్వారా ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

పులివెందుల దశ మారింది

దాదా 25 ఏళ్ల రాజకీయ పోరాటం తర్వాత ఉమ్మడి ఏపీకి 2004లో సీఎం అయిన వైఎస్.. తన అడ్డా పులివెందుల ప్రగతికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటివరకు వైఎస్ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్నందున పులివెందులకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. వైఎస్ సీఎం అయ్యాక పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీ (పడా)ను నెలకొల్పి.. రోడ్లు, పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. పంచాయతీ స్థాయి నుంచి పులివెందులను మున్సిపల్ కార్పొరేషన్ చేశారు.

గజ్వేల్ గతి మెరుగైంది

ఇక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో సిద్దిపేట స్థానం వదిలి గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్.. సీఎం బాధ్యతలు చేపట్టాక గజ్వేల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గడా)ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ సీఎం కావడంతోనే గజ్వేల్ కథ మారిపోయిందనే చెప్పాలి. ఓ సాధారణ నియోజకవర్గంగా ఉండే గజ్వేల్ ఊహించనంత డెవలప్ అయింది. నియోజకవర్గంలో అటవీ కళాశాల సహా అనేక డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపట్టారు కేసీఆర్. రోడ్లు ప్రాజెక్టులు వంటివి తీసుకోచ్చారు.

ఇక కొడంగల్ వంతు..

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా రేవంత్ రెడ్డికి సీఎం బాధ్యతలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కూ మహర్దశ పట్టనుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ-కడా)ను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంగా ఇది కొనసాగుతుంది. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌ గా ఉంటారు. కొడంగల్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయడమే కడా లక్ష్యం. కడాకు రాష్ట్ర ప్రణాళిక శాఖ నోడల్‌ గా వ్యవహరిస్తూ ఆర్థికశాఖను సమన్వయపరుస్తూ కొత్త పోస్టుల మంజూరు, అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తుంది.