కూటమిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఎక్కడంటే.. !
కూటమి పార్టీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి.
By: Tupaki Desk | 17 Feb 2026 12:00 PM ISTకూటమి పార్టీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. దీంతో నిరంతరం కూటమికి సెగ తగులుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అనంతపురం, గుంటూరు లో జరిగిన వివాదాలకు తోడు అరవ శ్రీదర్ వ్యవహారం కూడా కూటమిలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు తాజాగా మచిలీపట్నం ఎంపీ.. ఇదే పరిధిలోని గన్నవరం ఎమ్మెల్యే మధ్య వివాదం తార స్థాయికి చేరింది.
తన వ్యతిరేక వర్గాన్ని ఎంపీ ప్రోత్సహిస్తున్నారన్నది ఎమ్మెల్యే వాదన. అదేం లేదు.. తాను అందరినీ సమానంగానే చూస్తున్నానని ఎంపీ చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఈ వివాదం పెద్దదిగానే కనిపిస్తోందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత 2024 ఎన్నికలకు ముందు వరకు ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరికీ ఒకే సమస్య వచ్చింది. అదే టికెట్ వ్యవహారం.
దీంతో ఇరువురూ.. పార్టీలు మారారు. బాలశౌరి జనసేన తరపున మచిలీపట్నం నుంచి విజయం దక్కిం చుకున్నారు. యార్లగడ్డ.. టీడీపీ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇరువురి మధ్య వివాదాలు ఉన్నాయని అంటారు. ఇప్పుడు కూడా అవే వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన ఎగస్పార్టీ వర్గానికి చెందిన నాయకుడికి, ముఖ్యంగా తనను తీవ్రంగా దూషించిన నేతకు ఎంపీ పనిగట్టుకుని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ బోర్డు డైరెక్టర్ పదవిని ఇప్పించారన్నది యార్లగడ్డ చేస్తున్న ఆరోపణ.
అయితే.. వివాదాలతో తనకు సంబంధం లేదని.. పొట్లూరి బసవరావుకు ఉన్న అనుభవం నేపథ్యంలోనే ఆయనను ఎంపిక చేశారని ఎంపీ వర్గం చెబుతోంది. కానీ, యార్లగడ్డ మాత్రం ఈ విషయంపై మండి పడుతున్నారు. మరోవైపు.. టీడీపీ సీనియర్ అయిన.. బసవరావుకు పదవి ఇస్తే.. ఎమ్మెల్యే ఓర్చుకోలేక పోతున్నారని.. బసవరావు వర్గం మండిపడుతోంది. మరోవైపు.. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో భూముల కేటాయింపు విషయంలోనూ తనకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ రెండు అంశాలు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయాయి. మరి దీనిపై టీడీపీ-జనసేన అధినేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
