Begin typing your search above and press return to search.

అత్యంత కుర్ర 'సెల్ఫ్ మేడ్' బిలియనీర్ స్టోరీ

లూసీ గువో అమెరికన్ సోషల్ మీడియా ప్రభావశీలురాలు. అలాగే ప్రముఖ AI స్టార్టప్ ‘స్కేల్ ఏఐ’ సహ స్థాపకురాలు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 4:30 PM
అత్యంత కుర్ర సెల్ఫ్ మేడ్ బిలియనీర్ స్టోరీ
X

ప్రపంచంలోనే అత్యంత యువ 'సెల్ఫ్ మేడ్' బిలియనీర్‌గా టైలర్ స్విఫ్ట్ స్థానాన్ని తాజాగా లూసీ గువో అనే యువతి దక్కించుకుంది. ఆమె సంపద విలువను ఫోర్బ్స్ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. కానీ ఈ 30 ఏళ్ల అమెరికన్ యువతికి విలాసవంతమైన జీవితం మీద మాత్రం ఆసక్తి కనిపించడం లేదు.

లూసీ గువో రోజువారీగా ధరించే దుస్తులు షీన్‌లో కొనుగోలు చేసినవో, లేక ఉచితంగా దక్కినవో అని ఆమె ఫార్చూన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మినహాయింపుగా కొన్ని డిజైనర్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటుంది. అంతేకాకుండా ఆమె ఇంకా పాత హోండా సివిక్‌నే నడుపుతుంది, ప్రైవేట్ జెట్ ప్రయాణాల మీద విరక్తి చూపుతుంది. "నాకు డబ్బు వృథా చేయడం ఇష్టం ఉండదు" అంటూ చెప్పిన లూసీ, దీన్ని తన జీవనశైలిలో నిలిపిపెట్టుకుంది. దీర్ఘ ప్రయాణాలైతే బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం డబ్బు ఖర్చు చేస్తానని, కానీ సాధారణంగా చౌకగా, తక్కువ ఖర్చుతోనే జీవించడాన్ని ఇష్టపడతానని చెప్పింది.

లూసీ గువో ఎవరు? ఆమె సంపదకు మూలం ఏమిటి?

లూసీ గువో అమెరికన్ సోషల్ మీడియా ప్రభావశీలురాలు. అలాగే ప్రముఖ AI స్టార్టప్ ‘స్కేల్ ఏఐ’ సహ స్థాపకురాలు. 2016లో స్కేల్ ఏఐ ని స్థాపించిన ఆమె రెండేళ్ల తరువాత భాగస్వామి అలెగ్జాండర్ వాంగ్‌తో అభిప్రాయ భేదాల వల్ల కంపెనీ నుంచి తొలగించబడింది. కానీ స్కేల్ ఏఐ లో 5% వాటా ఆమె వద్ద ఉంది. ఈ వాటా కారణంగానే ఆమెకు 1.3 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ లభించిందని ఫోర్బ్స్ అంచనా వేసింది. స్కేల్ ఏఐ ని స్థాపించేటప్పటికి లూసీ వయసు కేవలం 21 సంవత్సరాలు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ మధ్యలో కాలేజీని వదిలేసి, ఫేస్‌బుక్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ప్రస్తుతం లూసీ 'పాసెస్' అనే ఓన్లీ ఫ్యాన్స్ ప్రత్యామ్నాయ వేదికను ప్రారంభించింది.

- డబ్బు ఉన్నా కూడా తక్కువ ఖర్చే...

"నేను షీన్ దుస్తులే ఎక్కువగా ధరిస్తాను. అందులో అన్నీ గొప్ప క్వాలిటీ వుండవు కానీ కొన్ని బాగుంటాయి, అవే మళ్లీ మళ్లీ వాడతాను" అంటూ చెబుతుంది లూసీ. అలాగే రోజూ ఉబర్ ఈట్స్ ఆర్డర్ చేస్తే 'బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లకోసం చూస్తానని కూడా నవ్వుతూ చెప్పింది. "డిజైనర్ దుస్తులు, విలాసవంతమైన కార్లు వాడేవారు సాధారణంగా మిలియనీర్ స్థాయిలో ఉంటారు. కానీ వాళ్లకు అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతరులకు తామెంత గొప్పవారో చూపించేందుకు బాహ్యంగా గొప్పగా స్టైలిష్ గా ఉంటారు" అని చెప్పడం విశేషం.

ఓ యువతికి లక్ష్యసాధనంటే ఇదే అని చూపించిన లూసీ గువో జీవితం ఇప్పుడు యువతకు స్ఫూర్తిగా మారుతోంది!