Begin typing your search above and press return to search.

తాడేపల్లి సిట్ ఆఫీసు క్యాంపస్ లో భారీగా పత్రాల కాల్చివేత.. అసలేమైంది?

సార్వత్రిక ఎన్నిల వేళ తాడేపల్లిలోని ఏపీ సిట్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది

By:  Tupaki Desk   |   9 April 2024 6:04 AM GMT
తాడేపల్లి సిట్ ఆఫీసు క్యాంపస్ లో భారీగా పత్రాల కాల్చివేత.. అసలేమైంది?
X

సార్వత్రిక ఎన్నిల వేళ తాడేపల్లిలోని ఏపీ సిట్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం విపక్ష నేత చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్ తోపాటు హెరిటేజ్ కు చెందిన పలుపత్రాలను భారీగా కుప్పపోసి తగలబెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారంతోపాటు.. ఈ వాదనకు బలాన్ని చేకూర్చే ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయం ఉన్న అపార్టుమెంట్ ప్రాంగణంలో సోమవారం ఉదయం పది గంటల వేళలో భారీగా పత్రాల్ని కాల్చేసిన వైనం రాజకీయ రగడగా మారింది.

మరో 34 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగే సమయంలో..ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాల్ని కాల్చేసినట్లుగా ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాల్ని.. హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన చందంలోనే.. ఏపీ సిట్ అధికారులు సైతం వ్యవహరించారన్న ఆరోపణను టీడీపీ వర్గీయులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెలంగాణలో మాదిరి ఏపీలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా ఈ వ్యవహారం నడిచినట్లుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా తగులబెట్టిన పత్రాల్లో అసలేం ఉన్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విపక్షాల వాదన ప్రకారం సిట్ అధిపతి.. ఐజీ కొల్లి రఘురామ్ రరెడ్డి వద్ద పని చేసే సిబ్బంది భారీగా పత్రాల్ని తీసుకొచ్చి అపార్టుమెంట్ ప్రాంగణంలో ఒక మూలన కుప్పగా పోసి నిప్పుపెట్టినట్లుగా తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసుతోపాటు ఈ కేసులో భాగంగా హెరిటేజ్ సంస్థ.. సిట్ అదనపు ఎస్పీకి రాసిన ప్రతులు లాంటివి ఉన్నట్లుగా చెబుతున్నారు.

కాల్చేస్తున్ పత్రాల గురించి స్థానికులు అడగ్గా.. చంద్రబాబుకు సంబంధించిన పత్రాలుగా సిబ్బంది చెబుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అన్నది ప్రశ్న. ఎందుకుంటే.. రహస్యంగా సాగాల్సిన పనిని అందరూ చూస్తుండగా ఓపెన్ గా ఎందుకు చేస్తారు? అన్నదిఒక ప్రశ్న అయితే ఒకవేళ పత్రాల్ని కాల్చేస్తున్న వేళ స్థానికులు సిట్ ఆఫీసుకు వచ్చి.. పత్రాల్ని కాల్చే వారిని ప్రశ్నిస్తే.. వారు సమాధానం చెప్పటమా? ఇది జరిగే పనేనా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై సిట్ అధిపతి విడుదల చేసిన ప్రెస్ నోట్ సందేహాలకు సమాధానాలు చెప్పేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్ నమోదు చేసిన కేసులకు సంబంధించిన కొన్ని లక్షల పేజీలు జిరాక్సు తీస్తున్నామని.. దీంతో జిరాక్స్ యంత్రాలు వేడెక్కాయని.. కాగితాలు యంత్రాల్లో చిక్కుకుపోయి చెడిపోయాయని.. జిరాక్సు మిషన్ లో ఇంకు తగ్గటంతో కొన్ని పత్రాలు క్లారిటీగా లేవని.. వాటిని తగలబెట్టామే తప్పించి.. మరేమీ లేదన్న మాటను వివరణగా చెప్పటం గమనార్హం. మొత్తంగా రానున్న రోజుల్లో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.