Begin typing your search above and press return to search.

నేడు సీఐడీ విచార‌ణ‌కు లోకేష్... రేపు పునీత్ వంతు?

ఈ నేపథ్యంలో అనేక పరిణామల అనంతరం తాజాగా ఈరోజు అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్‌ అలైన్ మెంట్ కేసుకు సంబంధించి లోకేష్ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 6:04 AM GMT
నేడు సీఐడీ విచార‌ణ‌కు లోకేష్... రేపు పునీత్  వంతు?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాబు జైలు జీవితం మాసం పూర్తి చేసుకుంది. అయితే బాబు అరెస్ట్ అనంతరం చినబాబు లోకేష్ హస్తినకే పరిమితమయ్యారు. న్యాయనిపుణులపై సుదీర్ఘ చర్చలు, సమాలోచనల నేపథ్యంలోనే ఆయన అక్కడున్నారని టీడీపీ నేతలు చెప్పుకున్నారు.

మరోపక్క అరెస్ట్ భయంతోనే హస్తినలో చినబాబు తలదాచుకున్నారని వైసీపీ నేతలు వెటకారమాడారు. ఈ సమయంలో కోర్టు ఆదేశాలతో ఢిల్లీలో లోకేష్ ను కలిసిన సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రామన్నారు. ఈ నేపథ్యంలో అనేక పరిణామల అనంతరం తాజాగా ఈరోజు అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్‌ అలైన్ మెంట్ కేసుకు సంబంధించి లోకేష్ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

అవును.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో సీఐడి ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో లోకేష్ ను విచారించేందుకు సీఐడీకి ఇటీవల ఏపీ హైకోర్టు అనుమ‌తిచ్చింది. ఇదే సమయంలో... విచార‌ణ స‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా ఫాలో కావాల‌ని సూచించింది. దీంతో లోకేష్ ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి బయలుదేరారు.

రింగ్ రోడ్డు కేసులో సీఐడి ఎలాంటి ప్రశ్నలు అడిగినా స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని లోకేష్ ఇప్పటికే ప్రక‌టించారు. అయితే లోపలికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది సాయంత్రానికి తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విచారణ ఈ రోజు సాయంత్రం ఐదుగంటల వరకూ జరగనుండగా... మధ్యలో ఒక గంట లంచ్ బ్రేక్ ఇస్తారు. విచారణ సమయంలో లోకేష్ తో పాటు ఒక న్యాయవాది కూడా ఉంటారు!

దీంతో... విచార‌ణ‌లో ద‌ర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నల‌కు లోకేష్ సూటిగా స‌మాధానాలు ఇస్తారా.. లేక, అరెస్ట్ కు దారితీసే పరిస్థితులు కల్పిస్తారా అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో బలంగా నడుస్తుంది. కాగా... ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ఏ14గా ఉన్న సంగతి తెలిసిందే.

పునీత్ కు సీఐడీ నోటీసులు:

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఏ-14 లోకేష్ ను విచారిస్తుండగా... మరోపక్క పునీత్ కు నోటీసులు జారీ చేసిన సీఐడీ... ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

అవును... ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా చెబుతున్న మాజీ మంత్రి నారాయణ అల్లుడే ఈ పునీత్! దీంతో తాజాగా ఇతనికి కూడా ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను క్యాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ వేయగా... దానిపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుందని తెలుస్తుంది.

కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారం మరో నలుగురి పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మాజీమంత్రి నారాయణ భార్య రమాదేవి, ఆవుల మణిశంకర్, సాంబశివరావు, ప్రమీల పేర్లను చేర్చిన అధికారులు... ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు.