Begin typing your search above and press return to search.

వివేకా కేసులో సీబీఐ విచారణ లేదేం జగన్?: లోకేశ్

దాంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Sept 2024 3:39 AM
వివేకా కేసులో సీబీఐ విచారణ లేదేం జగన్?: లోకేశ్
X

తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ హయాంలో తప్పు జరగలేదని, టీడీపీ నేతలవి తప్పుడు ఆరోపణలని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వచ్చి ప్రమాణం చేశారు. దాంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ కౌంటర్ స్పందించారు. సీబీఐ విచారణపై వైసీపీ వాళ్లకు అంత ప్రేమ ఉంటే... బాబాయి హత్యపై జగన్ ఎందుకు సీబీఐ విచారణ జరపలేదని లోకేశ్ ప్రశ్నించారు. వివేకా కూతురు సునీత గారే సీబీఐ విచారణ కావాలని అడిగినా ఎందుకు వేయలేదని నిలదీశారు. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా జగన్ ఎందుకు ఎగ్గొడుతున్నాడో చెప్పాలని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి చాలెంజ్ కు స్పందించి 24 గంటలు తిరుమలలో వెయిట్ చేసినా ఆయన రాలేదని గుర్తు చేశారు.

మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేశారంటే దాని అర్థం ఏంటండీ? అని ప్రశ్నించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండడం బాధాకరమని, నెయ్యి కల్తీకి సంబంధించి డాక్యుమెంట్లు, నివేదికలు, టెండర్ల ప్రక్రియ వివరాలు బయటపెట్టామని అన్నారు. లడ్డూ నాణ్యత లోపించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దానిని మనందరం అర్థం చేసుకోవాలని, రాజకీయం చేయకూడదని హితవు పలికారు.