Begin typing your search above and press return to search.

ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం ?

ఏపీ ఎపుడూ రాజకీయంగా సంచలనాలకు వేదికగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. ఏపీ ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ.

By:  Satya P   |   16 Feb 2026 7:00 AM IST
ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం ?
X

ఏపీ ఎపుడూ రాజకీయంగా సంచలనాలకు వేదికగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. ఏపీ ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అదే విధంగా పార్టీలు కూడా దూకుడు మీద ఉంటాయి. ఇక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎపుడూ రాజకీయం వేడి మీద ఉంటుంది. ఎన్నికలు రేపో మాపో అన్నట్లుగానే రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ సాగుతూ ఉంటుంది. దానికి కారణం ఏపీలో రాజకీయ సామాజిక నేపథ్యం అన్నీ గిరి గీసినట్లుగా అటూ ఇటూ మోహరించి ఉండడమే అని విశ్లేషణలు ఉన్నాయి.

కొత్త చర్చతో హీట్ :

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న వేడి చాలదు అన్నట్లుగా కొత్త చర్చ ఏపీ పాలిటిక్స్ ని ఊపేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఈ నెల 12 కి అక్షరాలా 20 నెలలు పూర్తి అయింది. మరో నాలుగు నెలలలో రెండేళ్ళలు పూర్తి అవుతాయి. ఏపీలో చంద్రబాబు వంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడి సారధ్యంలో కూటమి ముందుకు సాగుతోంది. బాబుది అర్ధ శతాబ్దం రాజకీయం. దేశ రాజకీయాల్లోనే ఆయన బిగ్ ఫిగర్ గా ఉన్నారు. ఆయన అంతటి అనుభవం ఉన్న వారు దేశ రాజకీయాల్లో వర్తమానంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే బాబు వంటి బిగ్ ఫిగర్ ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో కొత్త నాయకత్వం వస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ మీద సామాజిక మాధ్యమాలు వేదికగా డిస్కషన్ సాగుతోంది. బాబు ప్లేస్ లో లోకేష్ సీఎం గా వస్తున్నారు అన్నదే ఆ చర్చ.

ముహూర్తంగా కూడా :

దానికి ఉగాది ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది మార్చి 19న వచ్చింది. ఆ రోజున ఏపీ కూటమి ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఉంటుందని కొత్త ముఖ్యమంత్రిగా నారా లోకేష్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రచారం సాగుతోంది. దానికి గల కారణాలు కూడా చెబుతున్నారు. తెలుగుదేశంలో యువ తరం కొత్త తరం ప్రతినిధిగా లోకేష్ ఉన్నారని అంటున్నారు. ఆయన సీఎం కావడానికి ఇదే సరైన తరుణం అని ఇంకా మూడేళ్ళకు పైగా అధికారం చేతిలో ఉండగానే లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే 2029 ఎన్నికల నాటికి ఆయన పార్టీకి ప్రభుత్వాన్ని సమర్ధంగా ముందుకు నడిపించి మరోసారి గెలిపించుకుని వస్తారని విశ్లేషిస్తూ దానికి ఉగాది ముహూర్తంగా లోకేష్ ని సీఎం చేయడమే మార్గం అని ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సోషల్ మీడియాలో అయితే చర్చ సాగుతోంది.

ఆత్మీయ విందుకు ముడి :

ఇదిలా ఉంటే లోకేష్ తాజాగా ఆత్మీయ విందు పేరుతో ప్రతీ జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అన్నీ మాట్లాడుతున్నారు. వారితో లంచ్ డిన్నర్ కూడా చేస్తున్నారు. ఇది పార్టీలోనే కాదు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఈ నూతన సంప్రదాయానికి తెర లేపిన విధానం చూస్తే తొందరలోనే లోకేష్ చేతికి పగ్గాలు వెళ్తున్నాయని అందుకే ఇదంతా అంటూ సోషల్ మీడియా కధనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయని అంటున్నారు.

సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం :

లోకేష్ రాజకీయ ఎదుగుదలకు పదవుల స్వీకారానికి పునాది రాయి పడింది 2017 ఉగాది వేళ అని గుర్తు చేస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకూ లోకేష్ ఏ సభలో సభ్యుడు కాదు, ఆయన మంత్రి అవుతారని పుకార్లు ఇలాగే వస్తూ ఉండేవి. ఎలా అవుతారు, ఏ అసెంబ్లీ సీటూ ఖాళీ లేదు కదా అన్నది అంతా మాట్లాడుకున్నారు. కానీ అనూహ్యంగా 33 ఏళ్ళ వయసులో లోకేష్ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. అలా ఆయన ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని కీలక శాఖలను దక్కించుకున్నారు. అలా ఉగాది ఆయనకు కలసి వచ్చింది మళ్లీ ఇపుడు కూడా ఉగాదినే ముహూర్తంగా పెట్టుకుని లోకేష్ ని ముఖ్యమంత్రి చేసే ప్రక్రియ మొదలైంది అని పుకార్లు గా సోషల్ మీడియాలో అయితే ప్రచారం సాగుతోంది.

గాసిప్స్ గానేనా :

అయితే రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరూ ఈ రకమైన గాసిప్స్ ని ప్రచారాన్ని అసలు నమ్మరని అంటున్నారు. ఎందుకంటే ఏపీ ఇపుడు అనేక సవాళ్ళతో ఉంది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం ఈ పరిస్థితుల్లో అవసరం అని అంతా అంటున్నారు అదే విధంగా చూస్తే అమరావతి పూర్తి కావాలి పోలవరం కంప్లీట్ కావాలి, ఏపీలో ఎన్నో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాలని అంటున్నారు. పైపెచ్చు బాబు నాయకత్వం అంటేనే కూటమిలో జనసేన కానీ బీజేపీ కానీ అంగీకరించి పనిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. టీడీపీ వరకూ క్యాడర్ కి లోకేష్ సీఎం కావాలని ఉన్నా ఆ విషయంలో సైకిల్ పార్టీ పూర్తి అనుకూలంగా ఉన్నా కూటమి రాజకీయాలను ఏపీ పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

లోకేష్ వ్యాఖ్యలు :

అయితే ఈ తరహా ప్రచారం మీద నారా లోకేష్ సైతం ఆసక్తిగా లేరని అంటున్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ పార్లమెంటరీ కమిటీ నేతల సమావేశంలో అతి ఉత్సాహంతో లోకేష్ సీఎం అని ఒక కార్యకర్త నినాదాలు చేస్తే లోకేష్ సున్నితంగానే వద్దు అని చెప్పుకొచ్చారు మన పార్టీకి కూటమికి నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైన్యాధిపతి, మనమంతా సైనికులం అని లోకేష్ చెప్పుకొచ్చారు మీరంతా ఈ తరహా స్లోగన్స్ ఇస్తూ ఉన్న ఉద్యోగం పీకించేలా ఉన్నారు అని లోకేష్ చమత్కారంగా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా సోషల్ మీడియా ప్రచారంగా ఉంది కానీ ఉగాది వేళ రాజకీయ సంచలనం ఏదీ నమోదు అయితే కాదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.