లిక్కర్ స్కాంపై ఎవరూ మాట్లాడొద్దు.. మంత్రులకు సీఎం ఆదేశాలు!
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
By: Tupaki Desk | 21 May 2025 4:00 AM ISTరాష్ట్రంలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై తీవ్ర చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ కామెంట్స్ చేయొద్దని ముఖ్యమంత్రి సూచించినట్లు చెబుతున్నారు. ఈ దశలో ఎవరు ఏం మాట్లాడినా విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందని మంత్రివర్గంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
స్కాంపై సిట్ అధికారులు నిప్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని మంత్రులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవరు మాట్లాడినా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నామని విమర్శలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉన్నందున రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించినట్లు చెబుతున్నారు. కుంభకోణంపై పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేశారని సమాచారం. అదేవిధంగా వచ్చే కేబినెట్ భేటీ నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నందున ఈ ఏడాది కాలంలో సాధించిన విజయాలు, తీసుకువచ్చిన పెట్టుబడులపై ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఇక రైతు సమస్యలపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెబుతున్నారు. రేషన్ సరుకులను సరఫరా చేస్తున్న ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వమే చెల్లించాలని, ఆ వాహనాలను యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా జూన్ లో తల్లికి వందనం నగదు పంపిణీ చేయాలని కూడా సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
