కుప్పంలో సరే.. సీమలో ఏం జరుగుతోంది.. బాబు ఏం చేయాలి ..!
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 18 Jun 2025 6:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. తమకు బాకీ ఉన్నా రన్న కారణంగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం.. తీవ్ర విమర్శలకే కాదు.. మహిళల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా విమర్శలు వచ్చేలా చేసింది. దీంతో సీఎం చంద్రబాబు వెంటనే బాధిత మహిళను ఆదుకోవాలని.. అదేసమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
అయితే.. వాస్తవానికి ఈ ఘటన వెనుక ఏం జరిగింది? అనేది కీలకం. కుప్పం పరిధిలోని నారాయణ పురాని కి చెందిన తిమ్మరాయప్ప.. ఇదే ప్రాంతానికి చెందిన ముని కన్నప్ప దగ్గర 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అయితే.. గత ఏడాది కాలంలో పనులు లేక.. తిమ్మరాయప్ప కుటుంబం నానా అగచాట్లు పడింది. దీంతో అప్పులు తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు.. కన్నప్ప ఫ్యామిలీ నుంచి అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరిగింది.
ఈ పరిణామాలతో పుట్టిన ఊళ్లో పరువు పోతుందని గ్రహించిన తిమ్మరాయప్ప.. ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఇక, భర్త వెళ్లిపోవడంతో భార్య శిరీష తన ఇద్దరు పిల్లలతో వేరే ప్రాంతానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. తాజాగా తల్లికి వందనం నిధులు పడ్డాయేమోనని తెలుసుకునేందుకు, తన పిల్లల టీసీలు తీసుకునేందుకు పాఠశాలకు వచ్చారు. ఈ విషయం తెలిసిన తిమ్మరాయప్ప.. కుటుంబం శిరీషను నిర్బంధించి అప్పు తీర్చాలని పట్టుబట్టడంతో వివాదం రేగింది.
ఈ క్రమంలో తిమ్మరాయప్ప కుటుంబానికి చెందిన మహిళలు శిరీషను చెట్టుకు కట్టేసి..కొట్టారు. ఇది వివాదం అయింది. అయితే.. అసలు సమస్య ఈ కుటుంబంతోనే పోలేదు. ఇలా.. అనేక కుటుంబాలు సీమలో ఇబ్బందులు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాలకు గ్రామాలు .. వలస పోయాయి. దీనికి కారణం.. స్థానికంగా పనులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాకపోవడమే. ఇది ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. వాస్తవం.
ఈ విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన ప్రభుత్వం ఈ తప్పును ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్నది దృష్టి పెడితే.. ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. మరి ఆదిశగాచంద్రబాబు ప్రభుత్వం సర్వే చేయించాలి. పనులు లేక వలస పోతున్న వారిని ఆదుకుంటే.. ఈ పరిస్థితులు లేకుండా వారు ఉన్న చోటే కలోగంజో తాగుతారు. అప్పుల నుంచి బయట పడతారు.
