Begin typing your search above and press return to search.

జూనియర్ చంద్రబాబుగా మారిన గులాబీ చిన్న బాస్

ప్రతికూల వేళలోనే.. ఒక వ్యక్తి సత్తా ఏంటి? సామార్థ్యం ఎంతన్న లెక్క ఇట్టే అర్థమవుతుంది

By:  Tupaki Desk   |   26 Jan 2024 9:30 AM GMT
జూనియర్ చంద్రబాబుగా మారిన గులాబీ చిన్న బాస్
X

ప్రతికూల వేళలోనే.. ఒక వ్యక్తి సత్తా ఏంటి? సామార్థ్యం ఎంతన్న లెక్క ఇట్టే అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏం ఉన్నా లేకున్నా.. ఎప్పుడు మాట్లాడాలి? మరెప్పుడు మౌనంగా ఉండాలన్న దానిపై ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో.. పవర్ చేజారిన తర్వాత కూడా తాము అధికారంలో ఉన్నట్లే వ్యవహరించే ధోరణిని ప్రజలు ఇట్టే గుర్తిస్తారు. మిగిలిన అంశాలతో పోలిస్తే.. ఈ తీరును ప్రజలు అస్సలు ఇష్టపడరు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. చంద్రబాబు తీరును చూస్తే.. ఆయన అప్పటికి తనను తాను ముఖ్యమంత్రిగా ఫీలయ్యే వారన్నట్లుగా ఆయన తీరు ఉండేది.

ఆ వ్యవహారశైలి నుంచి బయటపడటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. చంద్రబాబు తీరుపై అప్పట్లో బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తేవి. కట్ చేస్తే.. ఇన్నాళ్ల తర్వాత ఈ తరహా ధోరణి మళ్లీ మాజీ మంత్రి కేటీఆర్ లో కనిపిస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి కాకున్నా.. తన తండ్రి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్నిపాలించిన పదేళ్ల కాలంలో డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారన్న విషయం తెలిసిందే. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకొని అందుకు తగ్గట్లుగా రియాక్టు కావాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా మరో మూణ్నెళ్లు.. ఆర్నెల్లలో అధికారంలోకి వస్తామన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది.

అత్తెసరు మెజార్టీ ఉన్నప్పటికీ రేవంత్.. అందరిని కలుపుకుపోయి పాలన సాగిస్తున్న నేపథ్యంలో.. అవేమీ వర్కువుట్ కావని.. తాము వేసే ఎత్తులకు రేవంత్ ప్రభుత్వం చిత్తు అవుతుందన్నట్లుగా గులాబీ నేతల తీరు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బొటాబొటి మెజార్టీ మాత్రమే ఉంది. అయినప్పటికీ ఐదేళ్లు ఆయన ప్రభుత్వాన్ని నెట్టుకురాలేదు.

ఇక్కడ చెప్పేదేమంటే.. ప్రజలు ఐదేళ్ల కాలానికి పాలన చేయమని అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పరిస్థితుల్లో మార్పులు వచ్చి.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఏర్పడినప్పుడు.. అందుకు తగ్గట్లు స్పందించటం ఒక ఎత్తు. అందుకు భిన్నంగా ప్రభుత్వం కొలువు తీరిన రెండో రోజు నుంచే.. దాన్ని కూలదోయటమే తప్పించి మరో ఎజెండా లేదన్న వ్యవహారశైలి అంత మంచిది కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు తనను తాను సీఎంగా ఫీలయ్యే వారే తప్పించి.. వైఎస్ హయాంలో ఓడిన రెండు సందర్భాల్లో పార్టీని చీల్చేసి.. ఏదేదో చేసేసి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడలు వేయటం కనిపించదు.

తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ తీరు చూస్తే మాత్రం.. అనునిత్యం ఆయనలో అప్పటి చంద్రబాబు కనిపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఆయన్ను జూనియర్ చంద్రబాబుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పోలిక చిన్నవయసున్న కేటీఆర్ కు ఏ మాత్రం మంచిది కాదు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు మేలు చేయదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. వాస్తవాన్ని గుర్తెరిగి.. అందుకు తగ్గట్లు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో చూడాలి.