వైసీపీ ఆరోపణలపై కోటంరెడ్డి రియాక్షన్ ఇదే..
ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు అదే తీరులో ప్రతిఘటిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Aug 2025 6:00 PM ISTఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు అదే తీరులో ప్రతిఘటిస్తున్నారు. ఇక ఏపీలో నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరుకు సిఫారసు లేఖ ఇచ్చారంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరణ ఇచ్చారు.
అది సాదారణ విషయం..
ప్రజలు రకరకాల సమస్యలతో ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని పేర్కొన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా ఏమీ ఉండదని, స్థానిక ఎమ్మెల్యేలను ప్రజలు కలవడం సాధారణ విషయమేనని స్పష్టం చేశారు. అలాగే “శ్రీకాంత్ తండ్రి, సోదరుడు తనను సంప్రదించడంతో ఒక సిఫారసు లేఖ ఇచ్చాను. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు విని, వారి అభ్యర్థన మేరకు లేఖలు ఇవ్వడం సాధారణమే. అయితే చివరి నిర్ణయం మాత్రం అధికారులదే” అని పేర్కొన్నారు.
“జులై 16న తిరస్కరించారు – జులై 30న మంజూరైంది”
“నాకు సంబంధించిన లేఖను అధికారులు జులై 16న తిరస్కరించారు. ఆ తర్వాత జులై 30న పెరోల్ మంజూరు చేశారు. మధ్యలో 14 రోజులు గడిచాయి. కాబట్టి నా లేఖకు, చివరికి ఇచ్చిన అనుమతికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా అధికారుల స్వతంత్ర నిర్ణయం” అని స్పష్టం చేశారు.
వైసీపీపై విమర్శలు
ప్రస్తుత రాజకీయ విమర్శలపై కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. “వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారి పాలనలోనే ఇతర ఎమ్మెల్యేల సిఫారసులపై శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చారు. అప్పుడు అది తప్పుకాదా? ఇప్పుడు మాత్రమే తప్పు ఎందుకు?” అని ప్రశ్నించారు.
ఇకపై సిఫారసులు ఉండవు
కోటంరెడ్డి తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ – “ప్రతి సంఘటన మనకు పాఠం నేర్పుతుంది. ఈ అనుభవం తర్వాత ఇకపై ఎవరికి పెరోల్ కోసం సిఫారసు చేయను. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను కానీ ఇలాంటి అంశాల్లో దూరంగా ఉంటాను” అని ఖరారు చేశారు.
వివాదానికి తెరపడుతుందా?
శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై నెల్లూరులో గత కొద్ది రోజులుగా తీవ్ర రాజకీయ వాదోపవాదాలు జరుగుతున్నాయి. కోటంరెడ్డి స్పష్టీకరణతో ఈ వివాదం తగ్గుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు మరోసారి చర్చకు దారితీయడం ఖాయం.
