చంద్రబాబు విజన్ నిజం.. ఆ నాడు మేము నమ్మలేదు : కోమటిరెడ్డి వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబును కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
By: Tupaki Desk | 5 Dec 2025 10:18 PM ISTఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబును కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉండవిల్లిలో సీఎం ఇంట్లో సుమారు గంటన్నర పాటు మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఆయనకు అరకు కాఫీ రుచి చూపించిన సీఎం చంద్రబాబు, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఇక ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కోటమిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన బాగుందంటూ కితాబిచ్చారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను చంద్రబాబు అభినందించారని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. సీనియర్ నేత చంద్రబాబు ఆశీర్వదించడం గొప్పగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు బాగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాదులో చంద్రబాబు వల్లే హైటెక్ సిటీ సాధ్యమైందని అన్నారు. ‘‘చంద్రబాబు ఆ నాడు విజన్ అని చెప్పితే మేము నమ్మలేదు.. .కానీ నేడు చంద్రబాబు విజన్ నిజం అయింది.’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘‘ఆ నాడు చంద్రబాబు ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే మాకు అర్థం అయేది కాదు... కానీ చంద్రబాబు చెప్పిన దాని కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి.’’ అంటూ హైదరాబాద్ ఐటీ పరిశ్రమను ఉద్దేశించి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మీడియా హైలెట్ చేస్తోంది. తనకు 30 ఏళ్లుగా చంద్రబాబుతో పరిచయం ఉందని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రమ్మంటూ తమ ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందించానని తెలిపారు. తమ ఆహ్వానంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు అనుభవాలను తెలుసుకున్నానని చెప్పారు.
తాను ఎప్పుడూ చంద్రబాబుని ఫాలో అవుతానని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. తమ మధ్య తెలంగాణ పథకాలపైనా చర్చ జరిగిందని వివరించారు. చంద్రబాబుకి రెండు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చంద్రబాబు ఎప్పుడు కోరుకుంటారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల ఏపీ అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక బందరు పోర్ట్ వస్తే తెలంగాణకు బాగా ఉపయోగమని కోమటిరెడ్డి తెలపారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటరులు ఏర్పాటు చేస్తున్నామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ పైనా మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ హోదా కోసం పోట్లాడకుండా అసెంబ్లీ కి వచ్చి కూర్చోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై వచ్చి పోరాడాలని పిలునిచ్చారు. హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తామని జగన్ అనడం కరెక్ట్ కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ మాదిరిగా ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
