Begin typing your search above and press return to search.

టీడీపీ, తానా వేర్వేరు కాదు.. అధి నాయకత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది.. కోమటి జయరాం సంచలన వ్యాఖ్యలు

తానా సభల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తానా నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తానాలో కీలకమైన ఎన్ఆర్ఐ కోమటి జయరాం తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:00 PM IST
టీడీపీ, తానా వేర్వేరు కాదు.. అధి నాయకత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది.. కోమటి జయరాం సంచలన వ్యాఖ్యలు
X

తానా సభల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తానా నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తానాలో కీలకమైన ఎన్ఆర్ఐ కోమటి జయరాం తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు. తానా సభలకు ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానా, తెలుగుదేశం ఒకటేనని, టీడీపీకి అనుబంధంగా తాము పనిచేస్తున్నామని చెప్పిన కోమటి జయరాం.. అధికారంలో ఉండి టీడీపీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే వేదికపై కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు వ్యాఖ్యానించారు.

అమెరికాలో ఈ నెల 3, 4, 5వ తేదీల్లో తానా సభలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సభల వీడియోలు యూట్యూబ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తానా సభలకు రాష్ట్రం నుంచి పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు వెళ్లారు. ప్రధానంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు రఘురామరాజు, రోషన్ బాబు, అరవింద్ బాబు, వసంత క్రిష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య రాష్ట్రం నుంచి వెళ్లారు. అదేవిధంగా టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, నాదెండ్ల బ్రహ్మం, మహాసేన రాజేశ్ తోపాటు చాలా మంది నేతలు తానా సభల్లో పాల్గొన్నారు.

అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉండటంతో ఎమ్మెల్యేలు తానా సభలకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమ విదేశీ పర్యటనను ముగించుకున్నారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల తానా నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానా, తెలుగుదేశం వేర్వేరు కాదని, టీడీపీ కోసమే తాము పనిచేస్తున్నట్లు తానాలో కీలకమైన కోమటి జయరాం వ్యాఖ్యానించారు. తమ అభిష్టం తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకోవడంపై తాము బాధపడుతున్నట్లు చెప్పారు. తానా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘‘మాక్ అసెంబ్లీలో నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర పోషించమన్నారు. కానీ పోషించలేం. ఎందుకంటే మా బ్లడ్ అంతా పచ్చరక్తంతో నిండిపోయింది. మాది తెలుగుదేశం పార్టీ. తానా సభలకు రాజకీయ నాయకులు రావడం అనేది 2005లో మొదలుపెట్టాం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్సు అని మేము అత్యుత్సాహం చూపాం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించాం.. ఎమ్మెల్యేలు కూడా సుముఖత చూపారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, కూటమి రావాలి అని కోరుకున్నాం. తెలుగుదేశం పార్టీ, తానా వేరువేరు కాదు అని అధినాయకత్వం తెలుసుకోవాలి. తానాలో ప్రతి ఒక్కరూ టీడీపీ అధికారంలోకి రావాలని పనిచేసాం. అటువంటిది ఈ రోజు వేదికపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుపడుతున్నాం. పది మంది రావాల్సివుంది. అధికారంలో ఉండగా ఇలా జరగడంపై చాలా అసంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని కోరుతున్నాం అంటూ ముగించారు.