Begin typing your search above and press return to search.

తగ్గేదేలే అంటున్న జూనియర్ కోడెల...బాబు మీద తీవ్ర స్థాయిలో వత్తిడి....?

సత్తెనపల్లి టికెట్ తనకే కావాలని మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం పట్టుబడుతున్నారు

By:  Tupaki Desk   |   25 Aug 2023 1:30 AM GMT
తగ్గేదేలే అంటున్న జూనియర్ కోడెల...బాబు మీద తీవ్ర స్థాయిలో వత్తిడి....?
X

గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం సత్తెనపల్లి. ఈ సీటు కోసం టీడీపీలో భారీ ఫైట్ సాగుతోంది. సత్తెనపల్లి టికెట్ తనకే కావాలని మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం పట్టుబడుతున్నారు. అయితే చంద్రబాబు తనదైన రాజకీయంతో ఆ సీటుకు సడెన్ గా తెచ్చి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఇంచార్జిగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకే టికెట్ అని చెప్పకనే చెప్పేశారు అన్న మాట.

దాంతో నాటి నుంచి రగులుతున్న కోడెల శివరాం తన దూకుడుని మరింతగా పెంచేశారు. ఆయన లేటెస్ట్ గా ఇంటింటికీ మీ కోడెల పేరుతో ఒక భారీ కార్యక్రమం తీసుకున్నారు. తన తండ్రి ప్రజలకు చేసిన కార్యక్రమాలు గుర్తు చేస్తూ తనకు మద్దతుగా నిలవమని ఆయన ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రజలను కోరుతున్నారు.

తన తండ్రి సత్తెనపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, వాటిని ఎవరూ కాదనలేరని కోడెల శివరాం అంటున్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తన తండ్రిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు అని శివరాం అంటున్నరు. తన తండ్రి పేరుని నిలబెడుతూ ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలను కొనసాగించడానికే తాను సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నట్లుగా శివరాం చెప్పారు.

తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తాను కొనసాగించి తీరుతాను అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కోడెల శివరాం పాల్గొన్నారు. అదే పాదయాత్రలో కన్నా లక్ష్మీ నారాయణ కూడా పాల్గొన్నారు. ఇలా ఇద్దరు నేతలూ పాల్గొని సత్తెనపల్లి టీడీపీ రాజకీయంలో వేడిని పెంచినా లోకేష్ మాత్రం కోడెల శివరాం కి ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు.

పార్టీని బలోపేతం చేసే విషయంలో దృష్టిని పెట్టాలని నారా లోకేష్ సూచించారు అని అంటున్నారు. దాంతో పార్టీ పెద్దల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన కోడెల శివరాం సత్తెనపల్లిలో తన దూకుడుని మరింతంగా పెంచేశారు. తాను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతాను అని ఆయన అంటున్నారు.

పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాననని లేకపోయినా చేస్తానని శివరాం అనడం ఇపుడు సంచలనంగా మారుతోంది. అంటే ఆయన టీడీపీ నుంచి వేరే పార్టీలోకి జంప్ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా చేస్తారా అన్నదే చర్చకు వస్తోంది. కోడెల శివరాం వెంట పెద్ద ఎత్తున స్థానిక టీడీపీ క్యాడర్ నడుస్తోంది. ఆయన సత్తెనపల్లిలో గత నాలుగేళ్ళుగా తిరుగుతూ పార్టీని బలోపేతం చేశారు.

ఇపుడు సడెన్ గా కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ అంటే క్యాడర్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. వారంతా కూడా రివర్స్ అయితే శివరాం కి మద్దతుగా నిలిస్తే కన్నా గెలుపు మీద అది తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. శివరాం జనంలో ఉంటూ తాను పోటీకి సిద్ధం అని చెబుతూ చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో వత్తిడి పెంచుతున్నారు అని అంటున్నారు. మరి బాబు ఈ టైం లో శివరాం ని ఎలా దారికి తెస్తారు అన్నది చర్చనీయాంశంగా ఉంది.