Begin typing your search above and press return to search.

జూన్ 4న జరగబోయేది అదే...కొడాలి జోస్యం...!

ఆ ఫలితాలు కూడా ఏపీలో టీడీపీకి దారుణంగా ఉంటాయని మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 10:00 PM IST
జూన్ 4న జరగబోయేది అదే...కొడాలి జోస్యం...!
X

ఏపీలో జూన్ 4న జరగబోయేది ఏంటో వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ఇప్పటిదాకా ఏపీ రాజకీయ చరిత్రలో మరీ ముఖ్యంగా టీడీపీ చరిత్రలో ఒక చెరగని గుర్తుగా మే 23 ఉంది. ఆ రోజున 2019 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి.

దీంతో టీడీపీకి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని చేదు అనుభవం ఆ రోజు కలుగచేసింది అని ఇప్పటికీ అంటారు. ఇపుడు జూన్ 4 అంటే ఏమిటి అంటే ఆ రోజు 2024 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఆ ఫలితాలు కూడా ఏపీలో టీడీపీకి దారుణంగా ఉంటాయని మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెబుతున్నారు.

ఏపీలో జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వస్తాయి, మరో మారు వైసీపీ అధికారంలోకి వస్తుంది, అపుడు టీడీపీని చంద్రబాబుని పట్టించుకునే నాధుడు ఎవరూ ఉండరని కొడాలి నాని తనదైన జోస్యం చెప్పేశారు. ఏపీలో వైసీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం ఎందరితో అయినా పొత్తులు పెట్టుకుంటారు అని ఎద్దేవా చేశారు.

అయినా ఆయన గెలిచేది లేదని కూడా స్పష్టం చేశారు. అధికారం కోసం ఎవరి వద్దకైనా వెళ్ళే చంద్రబాబుకు ఫలితాలు మాత్రం ఈసారి కూడా అనుకూలంగా ఉండవని కొడాలి మార్క్ జోస్యం వదిలారు. చంద్రబాబు ఓటమి ఖాయమని ఇదే తాను చెప్పేది అని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పేశారు.

గుడివాడలో ఈ రోజు లాంచనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తన మీద పోటీకి ఎన్నారైని తీసుకుని వచ్చారని అంతరిక్షం నుంచి ఎవరికి తెచ్చినా కూడా తన గెలుపుని అడ్డుకోవడం బాబు తరం కాదని అన్నారు. తాను వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచానని ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తాను అని ఆయన అన్నారు. ఇక గుడివాడలో తెలుగుదేశం రాజకీయ పరిస్థితి మీద ఆయన విశ్లేషించారు. కేవలం రెండు సార్లు తప్ప ఏనాడూ యాభై శాతానికి మించి ఓట్లు టీడీపీకి రాలేదని ఆయన అన్నారు.

ఈసారి కూడా అత్యధిక ఓట్లు తనకే వస్తాయని టోటల్ గా గుడివాడ నుంచి వరసగా అయిదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా తాను రికార్డు క్రియేట్ చేస్తాను అని ఆయన అన్నారు వాలంటీర్ల మీద టీడీపీ జనసేన చేసినన్ని విమర్శలు ఎవరూ చేసి ఉండరని ఇపుడు వాలంటీర్లకు మేలు చేస్తామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని బాబు వస్తే కనుక జన్మభూమి కమిటీలు పెట్టి తన పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం తరఫున జీతాలు చెల్లిస్తారని అంతే తప్ప వాలంటీర్ల వ్యవస్థను ఉండనీయరని ఆయన విమర్శించారు.

ఇక వాలంటీర్లను అడ్డుపెట్టుకుని గెలవాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. ప్రజలకు ఎవరు మంచి చేశారో బాగా తెలుసు అని వారే మరోసారి వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి మార్చి లోనే ఏపీ రాజకీయం ఉంటే జూన్ 4 దాకా కొడాలి నాని వెళ్ళడమే కాదు టీడీపీకి భవిష్యత్తు దర్శనం చేయించేశారు. మరోసారి మీ ఓటమి ఖాయం రాసిపెట్టుకోండి అని హాట్ కామెంట్స్ చేశారు.