Begin typing your search above and press return to search.

జైల్లో దోమలు కుట్టక.. రంభ ఊర్వశిలు కన్ను కొడతారా?

రాజకీయ ప్రత్యర్థులను ఉతికి ఆరేసేలా విమర్శలు చేయటం తప్పేం కాదు. దూకుడు రాజకీయాల్లో ఉన్న వారికి మాటలతో విరుచుకుపడటం ఒక ఆయుధం

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:45 AM GMT
జైల్లో దోమలు కుట్టక.. రంభ ఊర్వశిలు కన్ను కొడతారా?
X

రాజకీయ ప్రత్యర్థులను ఉతికి ఆరేసేలా విమర్శలు చేయటం తప్పేం కాదు. దూకుడు రాజకీయాల్లో ఉన్న వారికి మాటలతో విరుచుకుపడటం ఒక ఆయుధం. అలా అని అట్టే నోరు పారేసుకోవటం కూడా ఏ మాత్రం సరికాదు. అయితే.. ఈ విషయాల్ని పట్టించుకోకుండా చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు టీడీపీకి చెందిన వారు ఎవరైనా సరే.. విరుచుకుపడే తీరు కొడాలి నానిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్కిల్ స్కాం ఆరోపణలతో చంద్రబాబు జైలుకు వెళ్లిన వైనం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కొడాలి నాని రియాక్టు అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు అభ్యంతరకరంగా మారాయి. చంద్రబాబు మీద రాజకీయంగా సవాలచ్చ లెక్క తేడాలు ఉన్నప్పటికీ.. రిమాండ్ లో ఉన్న ఖైదీలకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని వదిలేసి.. విరుచుకుపడటమే ధ్యేయంగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది. ప్రతి రిమాండ్ ఖైదీకి జ్యూడిషియల్ కస్టడీ ఉంటుందని.. అందుకు చంద్రబాబు అతీతుడు కాదన్న మాట వరకు కొడాలిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

కానీ.. అక్కడి నుంచి ఆయన పూర్తిగాట్రాక్ తప్పటాన్ని విమర్శిస్తున్నారు. ‘‘ఆరోగ్య సమస్యలు ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకుంటే వెసులుబాటు కల్పిస్తారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే జైల్లో సౌకర్యాలు కల్పిస్తారు. వేడినీళ్లు ఇవ్వటం లేదు.. దోమలు కడుతున్నాయి అంటూ మాట్లాడటమా? జైల్లో దోమలు కుట్టక రంభా ఊర్వశిలు వచ్చి కన్ను కొడతారా ఏంటి? దోమలపై దండయాత్ర చేసినందుకు అవన్నీ పగబట్టి ఉంటాయి. కత్తి పట్టుకొని దోమల కోసం తిరిగాడు కదా. జైల్లో చాకు తీసుకొని దోమల్ని పొడవాల్సింది’’ అంటూ అవసరం లేని మాటల్ని.. సంబంధం లేని ఆగ్రహాన్ని ప్రదర్శించటాన్ని తప్పు పడుతున్నారు.

రిమాండ్ ఖైదీగా ఉన్నంత మాత్రాన దోమలు కుట్టే వాతావరణం జైల్లో ఉండాలనుకోవటం ఎంతటి అవివేకం? అన్నది ప్రశ్న. డెబ్భై ప్లస్ లో ఉన్న ఒక సీనియర్ రాజకీయ నేతకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేకున్నా.. దోమలు లేని విధంగా ఆయన ఉన్న సెల్ కు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితులను ప్రస్తావిస్తే.. ఎటకారం చేయటం ఏ మాత్రం సరికాదంటున్నారు.

చంద్రబాబు.. లోకేశ్ మీద కొడాలి నాని చేసిన మరికొన్ని ఇంట్రస్టింగ్ వ్యాఖ్యల్ని చూస్తే..

- చంద్రబాబు అరెస్టుతో లోకేశ్.. తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నాడు.

- నేను కానీ.. మా ముఖ్యమంత్రి కానీ లోకేశ్ పేరును చిత్తుకాగితం మీద కూడా రాయం. కొడుకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే చంద్రబాబు జైలుకు వెళ్లాడు.

- గతంలో తండ్రి కమిషన్ కొట్టేస్తే.. లోకేశ్ వచ్చాక సొంతం దోచేశారు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే.. అంత పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తారని చెప్పిన లోకేశ్.. ఇప్పుడు తన తండ్రిపై ఎక్కువ కేసులు పెడుతున్నారని గగ్గోలు ఎందుకు పెడుతున్నట్లు? ఇంతకూ లోకేశ్ కు నామినేషన్ పదవి వద్దా?

- చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుంది? చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ శాసనసభ్యులుగా పనిచేశారు. ఒకరు అధికార పార్టీలో ఉంటే.. మరొకరు ప్రతిపక్షంలో ఉన్నారు. నలబై ఏళ్ల నుంచి రెండు కుటుంబాలు విరుద్ధమైన పార్టీల్లోనే ఉన్నాయి. అప్పుడెప్పుడూ లేని వ్యక్తిగత కక్ష ఇప్పుడెందుకు వస్తుంది?

- చంద్రబాబు వ్యక్తిగత కక్ష తోనే.. కాంగ్రెస్ తో అనాడు జగన్ ను అరెస్టు చేయించారా? అప్పుడు సోనియా గాంధీ జగన్ ను అరెస్టు చేయించిన దాంట్లో చంద్రబాబు భాగస్వామ్యం ఉందా? అయినా.. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుంది? వైఎస్సార్ కూడా తనను ఏమీ చేయలేకపోయాడని బీరాలు పలికేవాడు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయి జైల్లో కూర్చున్నాడు.

- బాలయ్య డైలాగ్ లా ఫూట్ జింక ముందు ఊదాలి కానీ.. సింహం ముందు ఊదుతారా? చంద్రబాబు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకు లేదు. అలాంటప్పుడు ఆయనపై కక్ష మాకెందుకు ఉంటుంది? బాబుతో నేను అంటూ ప్రోగ్రాంలు చేస్తున్నారు.. బాబుతో నేను అంటే.. ఆయనతో పాటు జైలుకు వెళ్లాలా?