Begin typing your search above and press return to search.

ఛాతీకి బెల్ట్‌తో.. ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కొడాలి నాని.

By:  Tupaki Desk   |   27 Jun 2025 9:12 PM IST
ఛాతీకి బెల్ట్‌తో.. ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి
X

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ఏడాది తర్వాత గుడివాడ వచ్చారు. ఒకప్పుడు గుడివాడే అడ్డాగా మెలిగిన ఆయన ఇంత సుదీర్ఘ కాలం నియోజకవర్గానికి దూరంగా ఎప్పుడూ లేరు. అంతేగాక రాజకీయ జీవితం మొదలైన తర్వాత తొలిసారి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ ఓటమిపాలు కావడంతో నాని తెరమరుగయ్యారు. నిరుడు జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు రాగా.. కౌంటింగ్‌ కేంద్రం నుంచి కొడాలి బయటకు వెళ్తుండడమే ఇంకా బాగా గుర్తు. ఆ తర్వాత ఆయన గుడివాడలో ఉన్నారా?

హైదరాబాద్‌లో ఉన్నారా? అన్నది పెద్దగా బయటకు రాలేదు. కొన్నిసార్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ ఫొటోల్లో కనిపించారు. అయితే, అది తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసంలో జరిగిన సమావేశం. ఏడాది నుంచి కొడాలి విజయవాడ లేదా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కొడాలి నాని. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయనే ప్రధాన టార్గెట్‌గా మారుతారని అంతా భావించారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇక తదుపరి కొడాలి నానినే అని అనుకుంటుండగా.. కొన్ని నెలల కిందట ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ ఆ తర్వాత ముంబైలో చికిత్స పొందారు. ఆయన గుండెకు బైపాస్‌ సర్జరీ జరిగినట్లుగా తేలింది. దీంతో చాలాకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు.

కొడాలి నాని శుక్రవారం తన నియోజకవర్గం గుడివాడకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు చెందిన క్లాత్‌ షోరూంపై దాడి ఘటనలో కొడాలిపై గతంలో కేసు నమోదైంది. దీంట్లో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన తాజాగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో హైకోర్టు.. కింది కోర్టులో బెయిల్‌ తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన గుడివాడ వచ్చి దరఖాస్తు చేసి, హామీ పత్రాలు సమర్పించారు. క్లాత్‌ షోరూంపై దాడి కేసులో 16 మంది కొడాలి నాని అనుచరులు బెయిల్‌పై ఉన్నారు. వీరిలో కొందరు నాని చెబితేనే దాడి చేశామని పోలీసు దర్యాప్తులో తెలిపారు.

కాగా, నాని ఛాతీ చుట్టూ బెల్‌‍్ట తరహా ప్యాచ్‌తో కనిపించారు. బైపాస్‌ సర్జరీ అయిన నేపథ్యంలో ఆరోగ్య జాగ్రత్తల రీత్యా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు.