Begin typing your search above and press return to search.

అరకు ఎంపీ అభ్యర్ధిని టీడీపీ సెట్ చేసిందిగా...!

అరకు ఎంపీ సీటు టీడీపీకి ఎపుడూ సొంతం కాలేదు. టీడీపీ చరిత్రలో విశాఖ ఏజెన్సీ సీట్లు సవాల్ గానే మారుతున్నాయి

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:06 AM GMT
అరకు ఎంపీ అభ్యర్ధిని టీడీపీ సెట్ చేసిందిగా...!
X

అరకు ఎంపీ సీటు టీడీపీకి ఎపుడూ సొంతం కాలేదు. టీడీపీ చరిత్రలో విశాఖ ఏజెన్సీ సీట్లు సవాల్ గానే మారుతున్నాయి. ఇప్పటికి పాతిక ముప్పయి ఏళ్లు అయింది టీడీపీ విశాఖ ఏజెన్సీలో విజయాలు లభించి. అయితే ఈసారి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అన్నీ గెలుచుకోవాలని టీడీపీ అధినాయకత్వం గట్టి పట్టుదల మీద ఉంది. దాంతో మార్పుచేర్పులు పెద్ద ఎత్తున చేపడుతోంది.

అరకు పార్లమెంట్ ఇంచార్జిగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ని నియమిస్తూ టీడీపీ అధినాయకత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయనే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంతా భావిస్తున్నారు. విద్యాధికుడు అయిన శ్రావణ్ కుమార్ 2018లో అనూహ్యంగా మంత్రి అయ్యారు. ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సర్వేశ్వరరావు మంత్రి పదవిని ఆశించారు.

అయితే ఆయనను మావోయిస్టులు మాటు వేసి మరీ హత్య చేశారు. దాంతో ఆ సానుభూతిని సొంతం చేసుకునేందుకు చంద్రబాబు కిడారి శ్రావణ్ కుమార్ ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేశారు. ఆయనకే 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఆయన వైసీపీ వేవ్ లో మూడవ స్థానానికి పడిపోయారు.

ఇక అరకు నుంచి మంచి మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి చెట్టి ఫల్గుణ గెలిచారు. రెండవ స్థానంలో సియ్యారి దొన్ను దొర నిలిచారు. ఆయన వైసీపీలో ఉంటూ టికెట్ రాక రెబెల్ గా నాడు పోటీ చేస్తే మంచి ఓట్లు లభించాయి. దాంతో ఆయన్ని పార్టీలోనికి తీసుకుని అరకు టీడీపీ ఇంచార్జిగా టీడీపీ హై కమాండ్ నియమించింది. అంటే వచ్చే ఎన్నికలో సియ్యారి దొన్ను దొర ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న మాట.

ఇక అరకు ఎంపీగా శ్రావణ్ కుమార్ ని బరిలోకి దించనున్నారు. మరి శ్రావణ్ ఎమ్మెల్యేగానే గెలవలేదు, ఎంపీగా గెలుస్తారా అన్నది చర్చగా ఉంది. అయితే టీడీపీకి అరకు ఎంపీ క్యాండిడేట్ ఎవరూ లేరు అని అంటున్నారు. గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కొశోర్ చంద్రదేవ్ పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2014 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి పోటీ చేసి ఓడారు.

కిశోర్ చంద్రదేవ్ రాజకీయాల నుంచి విరమించుకున్నారు. సంధ్యారాణికి సాలూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో కొత్త ముఖం యువకుడు అని కిడారిని ఎంపీ అభ్యర్ధిగా నిర్ణయించారు అని అంటున్నారు. కిడారి సర్వేశ్వరరావు పట్ల ఉన్న సానుభూతి ఏమైనా ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్న ఈ మాజీ మంత్రికి టీడీపీ చెక్ పెట్టేసింది అని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.