Begin typing your search above and press return to search.

నా విషయంలోనే ఇలా చేశారు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు!

'అలాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు

By:  Tupaki Desk   |   5 Jan 2024 9:10 AM GMT
నా విషయంలోనే ఇలా చేశారు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు!
X

విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం షాకిచ్చిన సంగతి తెలిసిందే. తిరువూరులో జనవరి 7న జరగనున్న సభకు సంబంధించిన ఏ జోక్యం చేసుకోవద్దని నానికి సూచించింది. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్ల వ్యవహారాన్ని కేశినేని చిన్నికి అప్పగించామని తెలిపింది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును కూడా కేశినేని నానికి ఇవ్వడం లేదని ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురామ్‌ తదితరులతో తనకు పార్టీ అధిష్టానం చెప్పించిందని కేశినేని నాని ఫేస్‌ బుక్‌ లో పోస్టు పెట్టారు.

‘అందరికీ నమస్కారం.. నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్‌ గా చంద్రబాబు నియమించారని తెలిపారు. కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియచేశారు’ అంటూ ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశారు.

'అలాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు. కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియచేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను’ అని కేశినేని నాని తెలిపారు.

ఆ తర్వాత విజయవాడలోని కేశినేని భవన్‌ లో మీడియా చిట్‌ చాట్‌ లో కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఫేస్‌ బుక్‌ పోస్ట్‌లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని తెలిపారు. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని వెల్లడించారు. రాముడికి ఆంజనేయుడు తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తా అని స్పష్టంగా ఫేస్‌ బుక్‌లో పెట్టానని గుర్తు చేశారు.

మీడియాకు కావాల్సింది మసాలేనేగా.. తినబోతూ రుచులెందుకు, అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్‌ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్‌ కాకపోవచ్చనన్నారు. అది ఎవరికి ఎలా అర్ధమైతే అలా ఇచ్చుకోండి.. మీడియాను పట్టించుకోవటం ఎప్పుడో మానేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ రెడ్డి దొంగా అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసిందని నాని గుర్తు చేశారు. ఇప్పుడు అదే రేవంత్‌ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడని.. మీడియా ఏం పీకగలిగిందని కేశినేని నాని ప్రశ్నించారు. 2024 మే వరకూ విజయవాడ ఎంపీని తానేనన్నారు. తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు తెలిపారు. గొడవలు పడటం తన నైజం కాదని.. అంతమాత్రాన అది చేతకానితనం కూడా కాబోదన్నారు. తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉండాలనుకున్నానని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇవ్వబోమని ఆ పార్టీ అధిష్టానం చెబుతుంటే.. తాను మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్‌ సాధిస్తానని కేశినేని నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తాను ఢిల్లీ వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్‌ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు. ఏ ఫ్లైట్‌ ఖాళీ లేకపోయితే ప్రైవేట్‌ జెట్‌లో వెళ్ళాలి కదా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని.. పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని వ్యాఖ్యానించారు.

తాను వద్దని చంద్రబాబు అనుకున్నారని... తాను అనుకోలేదన్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా అంటూ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనవరి 7న ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టీడీపీ సభ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన కేశినేని నాని, తన సోదరుడు కేశినేని చిన్ని వర్గీయులతో గొడవ పడ్డారు. ఇరువర్గాలు బాహాబాహాకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులు సైతం గాయపడ్డారు.