Begin typing your search above and press return to search.

మీడియాను ఎదుర్కొనే దమ్ముందా? నానికి చిన్ని సవాల్

విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంత అన్నదమ్ములైన ఇద్దరు నేతలు కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 May 2025 3:55 PM IST
మీడియాను ఎదుర్కొనే దమ్ముందా? నానికి చిన్ని సవాల్
X

విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంత అన్నదమ్ములైన ఇద్దరు నేతలు కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని పలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఫేస్ బుక్స్, ఎక్స్ ద్వారా వివిధ పత్రాలను చూపుతూ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగానే సమాధానాలు చెబుతున్న ఎంపీ చిన్ని, ఈ రోజు మీడియాతోనూ మాట్లాడారు. తనపై విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ నాని తనలా దమ్ముంటే మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

బెజవాడ బ్రదర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. రాజకీయంగా ఒకరినొకరు తీవ్రంగా విభేదించుకుంటున్న ఇద్దరు సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర దుమారం రేపుతున్నారు. తన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న ఆరోపణలు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. తనలా మీడియాను ఎదుర్కొనే ధైర్యం లేక మాజీ ఎంపీ ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులోని మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ చిన్ని, మాజీ ఎంపీకి విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచరులు ధైర్యం లేక ఇంట్లో కూర్చొని తనపై బుదర జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు.

మాజీ ఎంపీ నానిలో పారదర్శకత, జవాబుదారీతనం లేదని, అక్రమంగా సంపాదించిన డబ్బుకు లొంగిపోయే వ్యక్తుల జాతికి చెందినవాడంటూ నిప్పులు చెరిగారు. తన విమర్శలపై వారు స్పందించాల్సిన అవసరం లేదని, వారు వివరణ ఇచ్చేందుకు కూడా అర్హత లేనివారుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, మాజీ ఎంపీ నానిపై టీడీపీ నేత నాగుల్ మీరా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మోసాలకు పాల్పడిన నాని ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రుణ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని, కంపెనీ వనరులను దుర్వినియోగం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ నాని త్వరలో జైలుకు వెళతాడని, తన బాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా అదే జైలుకు పంపునున్నారని వ్యాఖ్యానించారు.

కాగా, మాజీ ఎంపీ కేశినేని నానికి పలు అవినీతి వ్యవహారాలతో సంబంధం ఉందని విమర్శలు గుప్పించారు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు తరలించారని ఆరోపించారు. నాని హోటల్ డైరెక్టర్లను మార్చేసి అదే ప్రాంగణంలో తన కుమార్తెల పేరుతో ఆంధ్రా రెస్టారెంట్ నడుపుతున్నారని తెలిపారు. మాజీ ఎంపీ నాని ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.