Begin typing your search above and press return to search.

గతం గుర్తు చేసుకుంటూ... చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు!

అవును... ప్రస్తుతం "పొలంబాట" పేరుతో తెలంగాణ మాజీ ముఖ్యామంత్రి కేసీఆర్... కరీంనగర్ లో పర్యటించారు! ఈ కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు

By:  Tupaki Desk   |   6 April 2024 11:17 AM GMT
గతం గుర్తు చేసుకుంటూ... చంద్రబాబుపై కేసీఆర్  నిప్పులు!
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ఏ స్థాయిలో ఫైరవుతారనేది తెలిసిన విషయమే. 2014లో ఓటుకు నోటు వ్యవహారం దగ్గరనుంచి మరీ ఎక్కువగా.. చంద్రబాబు పేరు చెబితే నిప్పులు కక్కేస్తుంటారు కేసీఆర్. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు తెలిపి తెరవెనుక రాజకీయం చేశారంటూ బీఆరెస్స్ నేతలు చంద్రబాబుపై ఇప్పటికీ విమర్శలు కురిపిస్తుంటారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు.. ఏపీలో ఇప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు.. బీజేపీ, జనసేనల్తో కలిసి కూటమిగా ఏర్పడి.. ఏపీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం పొలంబాటలో బిజీగా ఉన్న కేసీఆర్... చంద్రబాబుతో తనకున్న ఒక ఫ్లాష్ బ్యాక్ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

అవును... ప్రస్తుతం "పొలంబాట" పేరుతో తెలంగాణ మాజీ ముఖ్యామంత్రి కేసీఆర్... కరీంనగర్ లో పర్యటించారు! ఈ కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.. ఈ సందర్భంగా రైతు కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కరీంనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గతంలో బూధాన్ పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి ఒక్కో కుటుంబానికీ రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తాను కోరినట్లు తెలిపారు కేసీఆర్. అయితే... ఆ మూర్ఖుడు, దుర్మార్గుడు తన మాటలను పట్టించుకోలేదని తెలిపారు.

దీంతో తానే భిక్షాటన చేసి రూ. 7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేశానని తెలిపారు. ఇదే సమయంలో... తెలంగాణలో బీఆరెస్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకువచ్చామని చెప్పిన కేసీఆర్... ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్, రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని తెలిపారు!!

మరోపక్క... ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్... ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్ లు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో... బీఆరెస్స్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే వ్యవసాయ సంక్షోభం వస్తుందని తాము ఊహించలేదని.. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం రేవంత్ రెడ్డి సర్కారే అని ఆయన మండిపడ్డారు.