నా చావు కోరుతున్నారు...కేసీఆర్ హాట్ కామెంట్స్ !
అలాంటి కేసీఆర్ చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తన మునుపటి జోరూ హుషారూ చూపించారు.
By: Satya P | 20 April 2026 10:57 PM ISTకేసీఆర్ అంటేనే పంచ్ డైలాగ్స్ ఉంటాయి. సెటైర్లు ఉంటాయి. ఆయన మాటలలో పదును ఎక్కువ. నాలిక దాటి వచ్చే ప్రతీ మాటా నిప్పులే కురిపిస్తాయి. అలాంటి కేసీఆర్ చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తన మునుపటి జోరూ హుషారూ చూపించారు. కారు సారు స్పీడ్ కి బ్రేకులే ఉండవని కూడా అనిపించారు.
చావమంటే చస్తానా :
తన చావుని కోరుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు. తెల్లారి లేస్తే తన చావు గురించే మాట్లాడే వారికి ఇదే తన మాట అన్నారు కేసీఆర్. తాను ఇప్పట్లో చావను అన్నారు. ప్రజలలో ఉంటాను అని ప్రజల కోసం పనిచేస్తాను అని చివరి శ్వాస వరకూ ప్రజల కోసమే తన జీవితం అన్నారు. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా అని సామెత కూడా చెప్పిన కేసీఅర్ తాను పోరాటం చేస్తూనే ఉంటాను అన్నారు.
ఏడు పదుల వయసులోనూ :
పార్టీలో చేరిన జీవన్ రెడ్డి తన వయసు 76 అంటున్నారు అని కేసీఅర్ సరదాగా కామెంట్స్ చేశారు. అయితే తనకు కూడా 72 ఏళ్ళ వయసు వచ్చిందని ఆయన వెనకాలే తానూ అన్నారు. తామిద్దరం తగ్గేది ఉండకూడదని అన్నారు. జీవన్ రెడ్డి తాను కలసి పనిచేస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి తనకు గత 45 ఏళ్ళుగా మంచి మిత్రుడని రాజకీయ సిద్ధాంత విభేధాలు తప్పించి తమ మధ్య మంచి అనుబంధం ఉందని కేసీఆర్ చెప్పారు. అంతే కాదు జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నామని ఆయన కేవలం జగిత్యాల మాత్రమే కాదు అన్ని జిల్లాలలో పార్టీని చూసుకోవాలని కేసీఆర్ చెప్పారు.
చంద్రబాబు గురించి కూడా :
టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు గురించి కూడా కేసీఆర్ ఇదే సభలో ప్రస్తావించడం విశేషం. తాను తెలంగాణా ఉద్యమంలోకి రావడానికి కారణం బాబు అని అన్నారు. ఆనాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నారని గుర్తు చేశారు. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారు అని ఈ విషయం మీద తగ్గించమని తాను లేఖ రాశాను అన్నారు. చార్జీలు తగ్గించకుంటే సమైక్య రాష్ట్రం నుంచి విడిపోతామని కూడా చెప్పాను అని కేసీఆర్ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయినా బాబు మాట వినలేదని పైగా రైతులు కరెంట్ చార్జీల తగ్గింపు కోరుతూ బషీర్ భాగ్ వద్ద ఉద్యమం చేస్తే ముగ్గురు రైతులను పట్టపగలు ఆనాటి టీడీపీ ప్రభుత్వం కాల్చి చంపించింది అని కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ విషయాలను చెప్పారు.
మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం :
దాంతో ఇక లాభం లేదని తాను జెండా ఎత్తాల్సి వచ్చిందని అన్నారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎవరూ గొంతెత్తేవారు కారని కట్టు బానిసలుగా వ్యవహరించేవారని ఆయన అన్నారు. పైగా ఎదిరించిన వారి మీద కాల్పులు జరగపడంతోనే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణా ఉద్యమం అంటేనే అన్నీ గుర్తుకు రావాలని కేసీఅర్ చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
