అప్పట్లో ఎటకారం ఆడేశారు.. ఇప్పుడు చంద్రబాబు మాటలే దిక్కు
అన్న మాటలు ఊరికే పోవు. అదే పనిగా వెంటాడుతుంటాయన్న మాటను కొందరు చెబుతుంటారు.
By: Tupaki Desk | 1 Jun 2025 10:22 AM ISTఅన్న మాటలు ఊరికే పోవు. అదే పనిగా వెంటాడుతుంటాయన్న మాటను కొందరు చెబుతుంటారు. అలాంటి మాటల్ని విన్నప్పుడు చాదస్తం మరీ ఎక్కువైపోతోందని ఎటకారం చేసేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. కొన్నిసార్లు కొందరి విషయంలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. అన్న మాటల ఫలితం అనుభవిస్తున్నారుగా.. అనుకోకుండా ఉండలేని పరిస్థితి. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవిత ఇష్యూలో అలాంటి సీనే కనిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఎటకారం ఆడేయటం.. ఎక్కసెం చేయటం.. చెప్పిన మాట ఒకటి అయితే.. దానికి మరో తరహాలో అన్వయించటం లాంటివి చేసేవారు కేసీఆర్ అండ్ కో. ఒకప్పుడు చంద్రబాబును ఉద్దేశించి ఏమేం అన్నారో.. ఇప్పుడు అలాంటివే తాము పడాల్సి రావటం చూసినప్పుడు ఎవరు చేసింది వారికే తగులుతుందనుకోకుండా ఉండలేం. సొంత మామకే వెన్నుపోటు పొడిచినోడు.. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడంటూ ఇష్టారాజ్యంగా చంద్రబాబును ఉద్దేశించి మాటలు అన్న కేసీఆర్ కుటంబ సభ్యులు.. ఇప్పుడు తన తండ్రి చుట్టూ దెయ్యాలు దూరాయన్న మాటను చెప్పటం తెలిసిందే.
దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఎందుకు చేరాయి? దేవుడికి దెయ్యాలకు మధ్యనున్న బంధం ఏమిటి? దేవుడు అనేటోడు దెయ్యాలను దగ్గరకు రానిస్తారా? అసలు దేవుడి వద్దకు దెయ్యాలు వెళ్లే ధైర్యం చేస్తాయా? లాంటి ఎన్నో ప్రశ్నలు కవిత మాటల్ని విన్నప్పుడు సందేహాలుగా మది నిండుగా నిండిపోవటం కనిపిస్తుంది. తాను చెప్పిన దెయ్యాలు ఎవరన్న విషయాన్ని ఇటీవల కాలంలో కవిత నోటి నుంచి పరోక్షంగా వచ్చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర విభజన వేళ.. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు మాటలకు కేసీఆర్ మొదలుకొని కవిత వరకు ఎన్నెన్ని మాటలు అన్నారో తెలిసిందే. అలాంటి కవిత నోటి నుంచి ఈ రోజున అదే రెండు కళ్ల మాట వచ్చిన పరిస్థితి. తన తండ్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. రెండో కన్ను జాగ్రతి సంస్థగా పేర్కొన్నారు. మరి.. అలాంటి రెండో కన్నును ఆయుధంగా చేసుకొని.. తన తండ్రి మరో కన్నును ఎందుకు దెబ్బ తీస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పార్టీలో నెలకొన్న లోపాల గురించి మాట్లాడుకోవటానికి వేదికలు ఉంటాయి కదా? అయినా.. కేసీఆర్ ఏమైనా కవితకు పరాయి వ్యక్తా? సొంత తండ్రి. ఆయన దగ్గరకు వెళ్లేందుకు కవితకు ఉండే అడ్డంకి ఏమిటి? తండ్రిని కలవాలని కూతురు డిసైడ్ అయితే.. మధ్యలో ఆపేదెవరు? ఒకవేళ ఆపితే.. తాట తీసేంత శక్తి సామర్థ్యాలు కవితకు లేకుండా లేవు కదా? అలాంటప్పుడు తన తండ్రి వద్దకు నేరుగా వెళ్లి పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. మార్పుల గురించి మాట్లాడి వస్తే సరిపోతుంది కదా? అందుకు భిన్నంగా ఇప్పుడు ఇంటి బయట నిలుచొని.. పార్టీ పరిరక్షణ కోసం.. ప్రక్షాళన కోసం.. దెయ్యాల నుంచి విముక్తి కల్పించేందుకు.. తన తండ్రి రెండు కళ్లను జాగ్రత్త చేసేందుకు కవిత పడుతున్న పాట్లు చూస్తే.. అప్పట్లో ఎటకారం.. ఇప్పుడేమో ఆ మాటల్నే ఆయుధాల్ని చేసుకోవటమా? అన్న మాట అనుకోకుండా ఉండలేం.
