Begin typing your search above and press return to search.

తెలంగాణలో టీడీపీ 87 స్థానాల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి

By:  Tupaki Desk   |   16 Oct 2023 10:02 AM GMT
తెలంగాణలో టీడీపీ 87 స్థానాల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చేసింది.

ఎన్నికల పోరులో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ అందరికంటే ముందుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్‌ కూడా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు కూడా ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా మరికొద్ది రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇక వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ, బీఎస్పీ వంటివి కూడా ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తాము తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి ఆ మేరకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది.

అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనేది నిన్నటి దాకా స్పష్టత లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలుపొందింది.

ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కాకముందు ప్రకటించారు. ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు తరలివచ్చారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ను కూడా నియమించారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి క్యాడర్‌ ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా సీమాంధ్రులు అధికంగా ఉన్నచోట, కమ్మ సామాజికవర్గం అధికంగా ఉన్నచోట టీడీపీకి పట్టు ఉందని అంటున్నారు.

దీనికి తగ్గట్టే చంద్రబాబు సైతం తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని తెలిపారు. సైబరాబాద్, హైటెక్‌ సిటీ టీడీపీ ప్రభుత్వ చలవేనని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు కావడంతో జైలులో ఉన్నారు. ఇదొక్కటే కాకుండా మరికొన్ని కేసులను కూడా జగన్‌ ప్రభుత్వం ఆయనపై సిద్ధం చేసింది. ఈ అన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్‌ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ను అరెస్టు చేయొచ్చని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పోటీకి ప్రధాన అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అ«ధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ లో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పష్టత నిచ్చారు.

ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌ లో కలిసి మాట్లాడానని కాసాని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పారు. తమకు 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామన్నారు. టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని కాసాని జ్ఞానేశ్వర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

చంద్రబాబు అక్టోబర్‌ 17న జైలు నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని గుర్తు చేశారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.