చిక్కుల్లో వైసీపీ కారుమూరి.. లెక్క తప్పిందా.. ?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భారీ చిక్కుల్లో పడ్డారు.
By: Garuda Media | 23 April 2026 10:48 PM ISTఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భారీ చిక్కుల్లో పడ్డారు. వైసిపి హయాంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి కీలకమైన మద్యం కుంభకోణంలో చిక్కుకుని గత కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు మరింతగా ముసురుకుంది. ఈ కేసులో ఆయన కుమారుడు సహా కోడలి పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు.
మొత్తంగా వీరికి సంబంధించి నోటీసులు కూడా అందించారు. ఇది ఇలా ఉంటే అసలు ఏం జరిగింది అనేది చూస్తే వైసిపి హయాంలో డిస్టిలరీల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టు ను కారుమూరి కుటుంబం తీసుకుంది అన్నది పోలీసులు చెబుతున్న మాట. ఈ క్రమంలో రవాణాకు సంబంధించిన అంశానికి డబ్బులు చేతులు మారాయని దీనిలో కారుమూరి కుటుంబం పాత్ర ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కేసులో పేర్కొన్నారు.
ఇది కారుమూరి ఫ్యామిలీకి ఫస్ట్ టైం ఏర్పడిన పెద్ద అడ్డంకిగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పెద్దగా అవినీతి అక్రమాలు వంటి ఆరోపణలు కారుమూరి కుటుంబం మీద పడలేదు. దీంతో స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గం పరంగా కూడా కారుమూరి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నమోదైన ఈ కేసు కారణంగా ఆయన ఇమేజ్ తగ్గడంతో పాటు నియోజకవర్గంలో కూడా కారుమూరి ఫ్యామిలీ పై సింపతీ పోయిందని వైసిపి నేతల్లో ఒక చర్చ నడుస్తోంది.
అయితే ఇది ఎలా ఉన్నప్పటికీ కారుమూరి బయటకు రావడం మానేశారు. ఈ కేసు విషయంపై ఆయన స్పందించడం కూడా తగ్గించారు. మరోవైపు పార్టీ నాయకులతో క్యాడర్ తోనూ ఆయన డిస్టెన్స్ పాటిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఆయన పరిస్థితి చిక్కుల్లో పడిందనే చెప్పాలి. రాజకీయంగా చూసుకున్నా లెక్క తప్పిందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది చూడాలి.
