136 లో 80 సంతకాలంటే... సీఎం మారుతున్నారా..!
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2026 3:42 PM ISTకర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఐదేళ్లు తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా సిద్ధరామయ్య చెబుతుండగా.. ఈ విషయంలో డీకే శివకుమార్ మాత్రం వీలైనంత మౌనంగానే కనిపిస్తున్నారు.. అదే సమయంలో కాస్త ముభావంగానూ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే మరో కీలక అభ్యర్థన హస్తినకు వెళ్లిందని అంటున్నారు.
అవును... 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 136 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే సీఎం పీఠం విషయంలో సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ పేరు కూడా బలంగా వినిపించింది. అయితే.. ఫైనల్ గా సిద్ధరామయ్యవైపే అధిష్టాణం మొగ్గు చూపింది! మరోవైపు... సిద్ధరామయ్య రెండున్నరేళ్లు సీఎంగా ఉంటే.. ఆ తర్వాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ఆ పదవిని చేపడతారనే చర్చా బలంగా జరిగింది. అయితే అది జరగలేదు!
ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలని సుమారు 80 - 90 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ ను అభ్యర్థించారని.. ఇప్పుడు నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉందని చెప్పిన ఎమ్మెల్యే ఇక్బాల్... తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి తగ్గట్లుగానే తాము ప్రవర్తించాలని.. డీకేకు ఒక అవకాశం ఇవ్వాలనేది తమ అందరి కోరిక అని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో.. ఈ మేరకు ఆ 80 మంది సంతకాలు చేశారనే ప్రచారమూ జరుగుతుంది!
సరిగ్గా ఈ సమయంలో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారని అంటున్నారు కానీ.. ఆ పెద్దలు ఎవరనే విషయం మాత్రం చెప్పడం లేదు. ఈ సందర్భంగా స్పందించిన శివకుమార్... తాను డిప్యూటీ సీఎం పదవితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్నందువల్ల ఈ సమావేశాలు సర్వసాధారణమే అని.. అయినా మీరెండుకు ఈ పర్యటనపై ఇంత ఆసక్తి చుపిస్తున్నారంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు.
ఏది ఏమైనా... ఎమ్మెల్యే ఇక్బాల్ సంచలన వ్యాఖ్యల వేళ.. పైగా ఆ మేరకు 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని సంతకాలు కూడా చేసి, అధిష్టాణానికి పంపారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. డీకే శివకుమార్ హస్తిన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఏదైనా కీలక పరిణామాలకు ఛాన్స్ ఉందా అనే చర్చా మొదలైంది! కాగా 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136, బీజేపీ 66, జేడీ(ఏస్) 18, ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే!
