Begin typing your search above and press return to search.

ఒక‌ప్ప‌టి బెస్ట్‌ఫ్రెండ్స్ చంద్ర‌బాబు - క‌ర‌ణం దొందూదొందే...!

ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల టైంలో బ‌ల‌రాంను ప‌క్క‌న పెట్టేయాల‌ని బాబు డిసైడ్ అయిపోయారు. అద్దంకి సీటు గొట్టిపాటి ర‌విదే అని తేల్చిచెప్పారు

By:  Tupaki Desk   |   20 Feb 2024 3:39 PM GMT
ఒక‌ప్ప‌టి బెస్ట్‌ఫ్రెండ్స్ చంద్ర‌బాబు - క‌ర‌ణం దొందూదొందే...!
X

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంకొల్లు స‌భ‌లో త‌న పాత మిత్రుడు, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంపై విమ‌ర్శ‌లు చేయ‌డం, దానికి కౌంట‌ర్‌గా క‌ర‌ణం చంద్ర‌బాబును దుర్మార్గుడు, అబ‌ద్ధాల కోరు అని విమ‌ర్శించ‌డం తెలిసిందే. వాస్త‌వంగా చూస్తే ఈ ఇద్ద‌రి బిహేవియ‌ర్ దొందూ దొందే అన్న చందంగానే ఉంటుంది. ఇద్ద‌రూ 1978లో ఫ‌స్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. బ‌ల‌రాం మ‌ధ్య‌లో పార్టీ మారినా పాత స్నేహంతో చంద్ర‌బాబు టీడీపీలోకి తీసుకున్నారు. టీడీపీలో ఆయ‌న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యారు. చివ‌ర‌కు 2014లో బ‌ల‌రాం కొడుకు వెంక‌టేష్‌కు అద్దంకి టిక్కెట్ ఇచ్చినా ఓట‌మి పాల‌య్యారు.

ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల టైంలో బ‌ల‌రాంను ప‌క్క‌న పెట్టేయాల‌ని బాబు డిసైడ్ అయిపోయారు. అద్దంకి సీటు గొట్టిపాటి ర‌విదే అని తేల్చిచెప్పారు. చివ‌ర్లో అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆ పార్టీలో ఇమ‌డ‌లేక‌.. చంద్ర‌బాబు త‌న‌ను ఎలా ? ఇబ్బంది పెట్టారో చెప్పి వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పుడు చీరాల‌లో టీడీపీకి ఎవ్వ‌రూ గ‌తిలేక క‌ర‌ణంను పంప‌గా ఆయ‌న అనూహ్యంగా విజ‌యం సాధించారు. అక్క‌డ గెలిచిన క‌ర‌ణం.. మ‌ళ్లీ వైసీపీ చెంత చేరిపోయారు.

విచిత్రం ఏంటంటే 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు త‌న విష‌యంలో చేసిన కుట్ర‌లు ఆమంచి బ‌య‌ట పెట్ట‌గా.. ఇప్పుడు టీడీపీని వీడి వైసీపీ చెంత చేరిన క‌ర‌ణం కూడా అదే చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు. విచిత్రం ఏంటంటే క‌ర‌ణం టీడీపీని వ‌దిలినా చంద్ర‌బాబును, ఆ పార్టీని మాత్రం ఎప్పుడూ ప‌న్నెత్తు మాట అన‌కుండా రాజ‌కీయం చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి ఇంకొల్లు స‌భ‌లో చంద్ర‌బాబు క‌ర‌ణంను టార్గెట్ చేస్తే.. క‌ర‌ణం కూడా బాబుపై ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు.

నాలుగేళ్లుగా ఎవ్వ‌రూ ఎవ్వ‌రిని విమ‌ర్శించ‌లేదు. మ‌రి ఇప్పుడెందుకు ఈ ఇద్ద‌రి నోర్లు లెగుస్తున్నాయంటే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల వైసీపీ టిక్కెట్‌ను త‌న త‌న‌యుడు వెంక‌టేష్‌కు ఇప్పించుకునే ప్ర‌య‌త్నాల్లో బ‌ల‌రాం ఉన్నారు. జ‌గ‌న్ ఆ విష‌యంలో అంత సుముఖంగా లేర‌న్న‌ది వాస్త‌వం. అంత‌కంటే ముందు ఇక్క‌డ మ‌రో తెర‌వెన‌క రాజ‌కీయం కూడా క‌ర‌ణం న‌డిపార‌న్న ప్ర‌చారం చీరాల‌లో జ‌రుగుతోంది. క‌ర‌ణం టీడీపీలోకి వెళ్లాల‌నుకునే ప్ర‌య‌త్నాలు కూడా జిల్లా నాయ‌కుల అభ్యంత‌రాల‌తో చంద్ర‌బాబు ఒప్పుకోలేదు.

ప‌నిలో ప‌నిగా ఇంకొల్లు స‌భ‌లో క‌ర‌ణంకు బాబు వాయిపెట్టేశారు. క‌ర‌ణం అవ‌కాశవాద రాజ‌కీయాన్ని బ‌హిర్గ‌తం చేశారు. ఇలాంటోళ్ల‌కు టీడీపీలో త‌లుపులు తెరిచి లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటు క‌ర‌ణం కూడా బాబుకు గ‌తిలేక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌ను చీరాల పంపారంటూ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా ఒక‌ప్ప‌టి బెస్ట్ ఫ్రెండ్స్‌కు ఇప్పుడు క‌లిసి రాజ‌కీయం చేసే ఛాన్సులు లేక ఇద్ద‌రూ ఒక‌రి నిజాలు ఒక‌రు బ‌య‌ట పెట్టుకుంటున్నారు.