Begin typing your search above and press return to search.

జగన్ కోసం సంతకం.. కానీ, కన్నా మెలిక! రచ్చ కంటిన్యూ

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతర పరిణామాలపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   10 April 2026 6:06 PM IST
జగన్ కోసం సంతకం.. కానీ, కన్నా మెలిక! రచ్చ కంటిన్యూ
X

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతర పరిణామాలపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. వైఎస్ మరణించారన్న విషయం నిర్ధారణ కాకముందే, తనను సీఎం చేయాలని ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి సంతకాలు సేకరించారని అచ్చెన్నాయుడు గురువారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సంతకాల సేకరణపై సీనియర్ నేత బొత్స చేసిన విమర్శలపైనా అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేత బొత్స అప్పటికప్పుడే ఎదురుదాడి చేయగా, తాజాగా బొత్స వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియా ముందుకొచ్చారు.

వైఎస్ మరణించిన తర్వాత జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని సంతకాలు సేకరించడంపై అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. వీటిని బొత్స ఖండిస్తూ, అప్పటి మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడితే అసలు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. వైఎస్ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం కరెక్టు కాదని బొత్స హితవు పలికారు. కాగా, బొత్స తన పేరు ప్రస్తావించడంతో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

బొత్స చెప్పినట్లు అప్పట్లో జగన్ ను సీఎం చేయాలని తాను సంతకాల సేకరించలేదని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, గౌరవంతో సంతకం మాత్రం పెట్టానని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై కన్నా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఎలాంటి వాడో తనకు తెలుసనని అన్నారు. జగన్ సీఎం అయిన 3 నెలలకే రాక్షస పాలన అంటూ తాను చెప్పానని కన్నా గుర్తు చేశారు. ఇక బొత్స ఎందుకు ఎమోషనల్ అయ్యారో ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు.

కాగా, బొత్స వ్యాఖ్యలు, కన్నా విమర్శలతో అప్పట్లో జగన్ ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేపట్టింది ఎవరు అన్నది మాత్రం స్పష్టం కాలేదని అంటున్నారు. దీనిపై మరో సీనియర్ రఘువీరారెడ్డి ఏమైనా చెబుతారా? అన్నది ఆసక్తి రేపుతోందని అంటున్నారు. మొత్తానికి 15 ఏళ్ల క్రితం నాటి వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తేనె తుట్టెను కదిపినట్లైందని అంటున్నారు. సీనియర్ నేతలు అంతా ఒక్కొక్కరుగా బయటకి వచ్చి మాట్లాడుతుండటం హాట్ టాపిక్ గా మారాయని అంటున్నారు.