Begin typing your search above and press return to search.

కన్నా, కన్నబాబు ఇద్దరి తీరు ఒక్కటేనా? ప్రత్యర్థులే వారి బలమా?

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు తమ రాజకీయ ప్రత్యర్థుల బలహీనతలను తమ బలంగా చెప్పుకుంటూ రాజకీయాలు చేయడమే ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 July 2025 2:00 AM IST
కన్నా, కన్నబాబు ఇద్దరి తీరు ఒక్కటేనా? ప్రత్యర్థులే వారి బలమా?
X

టీడీపీ నేత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీరు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఇద్దరికి సంబంధం లేకపోయినా, ఇద్దరిది వేర్వేరు పార్టీలు.. వేర్వేరు పార్టీలు అయినా వారిద్దరూ రాజకీయంగా ఒకేలా అడుగులు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవి రాలేదని చాలా కాలం మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మధ్యే ప్రత్యర్థి పార్టీలో జరిగిన ఓ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు యాక్టివ్ గా కనిపిస్తున్నారని అంటున్నారు. అటు మాజీ మంత్రి కన్నబాబు సైతం చాలాకాలం నిస్తేజంగా ఉండి ఇటీవల ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత సొంత నియోజకవర్గం కాకినాడ రూరల్ లో జోరు చూపుతున్నారని అంటున్నారు. ఈ ఇద్దరూ గతంలో కాంగ్రెస్ లో పనిచేయగా, ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గం నేతలు కావడం విశేషం.

కన్నా, కన్నబాబు ఇద్దరు సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తున్న నేతలే.. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు తమ రాజకీయ ప్రత్యర్థుల బలహీనతలను తమ బలంగా చెప్పుకుంటూ రాజకీయాలు చేయడమే ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. మంత్రి పదవి తగ్గలేదన్న అసంతృప్తితో ఏడాదిగా బయటకు రాని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల మాత్రం మీడియా వద్ద హడావుడి చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఆయన నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేచిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిని మార్చడాన్ని టీడీపీ ఎమ్మెల్యే కన్నా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తనను తట్టుకోలేకే వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అంబటిని తప్పించిందని కన్నా చెబుతున్నారు. గత ఎన్నికల్లో అంబటిపై పోటీ చేసి కన్నా గెలిచారు. అయితే అంబటిని తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం.. తన వల్లే అంబటిని సత్తెనపల్లి నుంచి తప్పించారని కన్నా చెప్పుకోవడంపై సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారని అంటున్నారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడితో విభేదాలతో కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లెలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అయితే వైసీపీలో చోటుచేసుకున్న అంతర్గత మార్పులను ఆయన అనుకూలంగా చేసుకోవడం చర్చకు తావిస్తోంది. అదేవిధంగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు రాజకీయాలు కూడా ఇదే మాదిరిగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన నేత పంతం నానాజి వ్యవహరిస్తున్నారు. అక్కడ టీడీపీ-జనసేన మధ్య విభేదాలు తన ఘనతేనంటూ చెప్పుకుంటున్నారు కన్నబాబు. ఎమ్మెల్యే పంతం స్వయం కృతం వల్ల ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కుంటుండగా, అది తన బలమేనంటూ కన్నబాబు చాటుకోవడంపై వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.