పోటీలో లేనప్పుడు మా డబ్బులు మాకివ్వండి.. కమల్ కు పార్టీ నేతల షాక్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టటమే ఒక సాహసం. దాన్ని విజయవంతంగా నిర్వహించటం అన్నింటి కంటే అతి పెద్ద సవాలు.
By: Tupaki Desk | 4 April 2026 9:46 AM ISTఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టటమే ఒక సాహసం. దాన్ని విజయవంతంగా నిర్వహించటం అన్నింటి కంటే అతి పెద్ద సవాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీని నడిపే వేళలో.. అధినేత తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ నేతలు.. క్యాడర్ కంటిన్యూ కావటం కత్తి మీద సామే. నిజానికి చాలామంది ప్రముఖులు ఇక్కడే సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు విశ్వనటుడు కం రాజ్యసభ సభ్యుడు.. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు.
తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ హాసన్ భావించారు. ఇందులో భాగంగా డీఎంకే కూటమితో కలిసి మిత్రపక్షంగా బరిలో నిలవాలనుకున్నారు. ఇందులో భాగంగా తమకు కనీసం 10-15 సీట్లు ఇవ్వాలని కమల్ హాసన్ కోరారు. తమ పార్టీ గుర్తు అయిన టార్చిలైట్ మీద పోటీ చేస్తామని కోరారు. అయితే.. డీఎంకే మిత్రపక్షాల నుంచి ఈసారి సీట్ల డిమాండ్ అధికంగా ఉండటంతో కమల్ హాసన్ కోరినట్లుగా సీట్లు ఇవ్వలేమని చెప్పింది. కావాలంటే తమ పార్టీ గుర్తు అయిన ఉదయ సూర్యుడు గుర్తుతో పోటీకి దిగాలని కోరింది.
అయితే.. ఈ అంశంపై కమల్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో.. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని కమల్ హాసన్ ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని గొప్ప త్యాగంగా డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణయంపై కమల్ హాసన్ పార్టీ నేతలు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎన్నికల్లో పోటీకి టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి.
నిజానికి 2019 లోక్ సభ ఎన్నికలు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు ఇస్తూ పోటీకి దిగలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయన పార్టీ నేతలు ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ విషయంలో కమల్ హాసన్ సైతం సానుకూలంగానే ఉన్నారు. సీట్ల సర్దుబాటు కష్టంగా ఉండటం.. తాము కోరినన్ని సీట్ల కేటాయింపు సాధ్యం కాదని చెప్పటం.. ఈమధ్యన కమల్ హాసన్ కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించటం లాంటి అంశాలతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. మొదట్లో ఎన్నికల్లో పోటీకి సానుకూలంగా ఉండి.. పార్టీ తరఫు పోటీ చేయాలని భావించే ఆశావాహులు అప్లికేషన్ పెట్టాలని కమల్ హాసన్ కోరారు. ఇందులో భాగంగా ప్రతి అప్లికేషన్ నుంచి రూ.50 వేలు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా మొత్తం 60 మంది అప్లికేషన్లు దాఖలు చేశారు. పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిన వేళ.. 60 మంది నుంచి దరఖాస్తుల రూపంలో సేకరించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఎన్నికల బరిలో లేనప్పుడు సేకరించిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. పోటీలో లేనప్పుడు డబ్బులు ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కమల్ హాసన్ నిర్ణయం పార్టీ ఇమేజ్ ను కాస్త దెబ్బ తీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
