Begin typing your search above and press return to search.

కవితక్క.. ఇలాంటి లెటర్ గతంలో ఒక్కసారి రాయలేదేం?

ఇప్పటికే అదే పనిగా మాట్లాడుతూ.. సమయం సందర్భం చూసుకోకుండా చేస్తున్న వ్యాఖ్యలతో మాజీ మంత్రి కేటీఆర్ అభాసుపాలు అవుతున్నారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:30 PM GMT
కవితక్క.. ఇలాంటి లెటర్ గతంలో ఒక్కసారి రాయలేదేం?
X

కొన్ని సందర్భాల్లో అద్భుతమైన మేధోసంపత్తి ఉన్నట్లుగా కనిపించే కొందరు.. తర్వాతి కాలంలో మరీ ఇంత పేలవంగా ఎలా వ్యవహరిస్తారు? అన్నట్లుగా తీరు ఉంటుంది. ఉద్యమ వేళలోనూ.. చేతిలో అధికారం ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తిరుగులేని తెలివికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేసీఆర్ అండ్ కో తాజాగా చేస్తున్న పనులు చూస్తుంటే.. వీరికి ఏమైంది? ఎన్నికల్లో ఎంత ఓటమి అయితే మాత్రం మరీ ఇంత పేలవంగా వ్యవహరించటం ఏమిటి? అన్న భావన కలుగక మానదు.

ఇప్పటికే అదే పనిగా మాట్లాడుతూ.. సమయం సందర్భం చూసుకోకుండా చేస్తున్న వ్యాఖ్యలతో మాజీ మంత్రి కేటీఆర్ అభాసుపాలు అవుతున్నారు. విషయం ఏదైనా కేటీఆర్ స్పందిస్తుంటే బీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే 2004 ఎన్నికల తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు గుర్తుకు వచ్చేలా మారిందంటున్నారు.

కొత్త ప్రభుత్వానికి కాస్తంత టైం కూడా ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన నాలుగైదు రోజులకే ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అది సరిపోదన్నట్లు.. నిత్యం ఏదో ఒక రివ్యూ పేరుతో రోజులు లెక్క పెట్టటం.. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల మీద విమర్శలు చేయటం లాంటి వాటితో రేవంత్ ప్రభుత్వం మీద అవసరానికి మించిన సానుభూతి పొందేలా చేస్తున్నారు.

ఇది సరిపోనట్లు తాజాగా ఎమ్మెల్యే కవిత రంగంలోకి దిగారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమె శాసన మండలి ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లోజరుగుతున్న అన్యాయంపై మండలిలోప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె లేఖ రాశారు. ఒకవేళ మండలి ఛైర్మన్ అనుమతి ఇస్తే జరిగేదేమిటి? ఆమె ప్రస్తావనకు సమాధానం చెప్పేందుకు మంత్రులుగా వచ్చే వారంతా గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాల్ని తూర్పార పట్టటం ఖాయం.

అదే జరిగితే కెలికి కంపు చేసుకున్నట్లు అవుతుంది. అన్నింటికిమించి.. ప్రభుత్వం కొలువు తీరి రెండు నెలలు కూడా కాక ముందే.. అప్పుడే నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రత్యేక ప్రస్తావన కోసం మండలి ఛైర్మన్ కు లేఖ రాసిన ఆమె.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అంశంపై తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఒక్కసారి అయినా లేఖ రాశారా? అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. కదిలించి తిట్టించుకోవటం అంటే ఇదేనేమో.