Begin typing your search above and press return to search.

నిప్పుతో చెలగాటం.. గాలిలో దీపంలా ప్రాణాలు.. అత్యంత ప్రమాదకరంగా ఫైర్ వర్స్క్

ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు అక్కడికి ఎవరూ వెళ్లలేకపోవడం వల్ల తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2026 6:49 PM IST
నిప్పుతో చెలగాటం.. గాలిలో దీపంలా ప్రాణాలు.. అత్యంత ప్రమాదకరంగా ఫైర్ వర్స్క్
X

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు అక్కడికి ఎవరూ వెళ్లలేకపోవడం వల్ల తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. చుట్టూ పొలాలు ఉండటం, బాణసంచా తయారు చేస్తున్న చోటకు సరైన రోడ్డు వసతి లేకపోవడంతో ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ వంటివి వెళ్లలేకపోయాయి. అంతేకాకుండా భీకర పేలుళ్ల శబ్దానికి దాదాపు గంట పాటు ఆ ప్రాంతానికి స్థానికులు ఎవరూ వెళ్లే సాహసం చేయలేకపోయారని చెబుతున్నారు. ఈ కారణంగా మంటల్లో చిక్కుకుని ఎక్కువ మంది మరణించారని అనుమానిస్తున్నారు.

ప్రమాదం జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలో ఎంత మంది కూలీలు పనిచేస్తున్నది ఇంకా స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో ఉన్న వారిలో దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. తొలుత మృతుల సంఖ్య 18గా ఉంటుందని అనుకున్నా, సమయం గడుస్తున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 22 వరకు ఉండొచ్చని అంటున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా చిద్రమయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చుట్టుపక్కల పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరి అవయువాలు పొలాల్లో పడివుండటాన్ని స్థానికులు గుర్తించారు.

ప్రమాదానికి సరైన కారణం తెలియడం లేదు. విస్ఫోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో గంధకం నిల్వలే దుర్ఘటనకు దారితీసి ఉండొచ్చని నిపుణులు సందేహిస్తున్నారు. ఫొరెన్సిక్ ఆడిట్ జరిగితే కానీ, ప్రమాదానికి స్పష్టమైన కారణం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం భీతావహంగా కనిపిస్తోంది. మంటల్లో కాలిపోయి, తీవ్రంగా గాయపడిన వారిని అతికష్టం మీద ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకుని చుట్టుపక్కల వారు, కూలీల బంధువులు అక్కడికి చేరుకుని తమ వారి సమాచారం తెలుసుకుంటున్నారు.

గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ

రాష్ట్రంలో అనుమతి ఉన్న బాణసంచా కేంద్రాల్లో సగం ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా అనుమతి లేని మందుగుండు సామగ్రి దుకాణాలు పెద్ద సంఖ్యలోనే కొనసాగుతున్నాయి. దీంతో ఏటా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరగడం, కూలీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాణాసంచా కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి సరైన బీమా సౌకర్యం ఉండటం లేదని చెబుతున్నారు. నిప్పుతో చెలగాటం అని తెలిసినా పొట్టకూటి కోసం తెగించి పనులు చేయాల్సివస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు కనీసం బీమా కట్టకుండా గాలికి వదిలేస్తూ బాణసంచా తయారీ కేంద్రాల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాద నివారణ చర్యలు కరువు

బాణసంచా దుకాణాలు, తయారీ కేంద్రాలు, గోదాముల వద్ద కనీస సదుపా యాలు ఉండటం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో తక్షణ నివారణ చర్యలకు అవకాశం ఉండటం లేదు. బాణసంచా కేంద్రాల వద్ద విద్యుత్‌ సరఫరా ఉండకూడదనే నిబంధన ఉన్నా, చాలా మంది పెడచెవిన పెడుతున్నారని చెబుతున్నారు. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. తీవ్రత తగ్గించే పరిక రాలు తూతూమంత్రంగా ఏర్పాటు చేయడం, ప్రమాద సమయంలో ఏం చేయాలో కనీస అవగాహన ఉండకపోవడం వల్ల కూలీల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని చెబుతున్నారు.