Begin typing your search above and press return to search.

పాలు పొంగాయని భార్య మీద ఆగ్రహం.. సూసైడ్ చేసుకున్న భర్త

చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

By:  Garuda Media   |   20 April 2026 11:00 AM IST
పాలు పొంగాయని భార్య మీద ఆగ్రహం.. సూసైడ్ చేసుకున్న భర్త
X

చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. పరీక్షల్లో తప్పినా.. అనుకున్నది సాధించలేకున్నా.. ప్రేమలో విఫలమైనా.. ఇలా ఏదో కారణంగా బలవన్మరణాలకు పాల్పడటం చూస్తుంటాం. అయితే.. సిల్లీగా అనిపించే కారణాలకు ప్రాణాలు తీసుకోవటం ఎక్కువైంది. మొబైల్ చూడొద్దని చెప్పటం.. టీవీ చూసే విషయంలోనూ.. ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. వీటికి మించి..తాజాగా వంటిల్లో పొయ్యి మీద పాలు పొంగియాని భార్య మీద కోపంతో భర్త ఒకరు ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది. మరో ఉదంతంలో సెల్ ఫోన్ చూడొద్దని అక్కా, బావ గట్టిగా చెప్పారన్న బాధతో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఉదంతాలు ఆదివారం కడప జిల్లాలో చోటుచేసుకోవటం గమనార్హం.

ఏపీలోని కడప తాలుకాలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కడప బాలాజీ నగర్ కు చెందిన 53 ఏళ్ల వెంకట సుబ్బయ్య.. అనురాధలు భార్యభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గతంలో వెంకట సుబ్బయ్య గల్ఫ్ లో పని చేసేవారు. ఇటీవల కడపకు తిరిగి వచ్చిన అతను అక్కడే ఒక షాప్ పెట్టి జీవనం సాగిస్తున్నారు.అయితే.. ప్రతి రోజు భార్యాభర్తలు ఇద్దరు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేవారు.

ఆదివారం స్టవ్ మీద పాలు పెట్టి.. ఆ తర్వాత దాన్ని సరైన సమయంలో ఆపకపోవటంతో పాలు పొంగాయి. స్టవ్ ఆపే విషయంలో భార్య ఆలస్యం చేయటం.. పాలు పొంగటానికి ఆమె నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పెద్దగా అరుస్తూ.. కోపంతో తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో.. తలకు చిన్న గాయమైంది. దీంతో భయపడిన బార్య బయటకు వచ్చి కూర్చుంది.

ఆ టైంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న భర్త వెంకట సుబ్బయ్య.. ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కాసేపటికి భర్త కోపం తగ్గి ఉంటుందని భావించిన అనురాధ ఇంట్లోకి వెళ్లి చూడగా.. భర్త ఫ్యాన్ కు ఉరి వేసుకునన వైనాన్ని చూసి కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు వచ్చి వెంకటసుబ్బయ్యను కిందకు దింపారు. అప్పటికే అతను ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా గుర్తించారు. పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

ఇదే కడప జిల్లాలో మరో చిన్న విషయానికి యువతి ప్రాణాలు తీసుకుంది. సెల్ ఫోన్ చూడొద్దని అక్కా, బావ మందలించిన ఉదంతంలో యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. రాజంపేట శివారులో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమిత్ర తన అక్కా బావల వద్ద ఉంటోంది. అక్కా బావ ఇద్దరు హోటల్ లో పని చేస్తుంటారు. అయితే.. 18 ఏళ్ల సుమిత్ర మాత్రం తరచూ సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేయటాన్ని ప్రశ్నించారు. మొబైల్ వాడటం తగ్గించాలంటూ అక్కా, బావలు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.