Begin typing your search above and press return to search.

జూనియర్ నోటి వెంట ఆ మాట.... తమ్ముళ్ళ తహ తహ

జూనియర్ ఎన్టీయార్ అర్జంటుగా చంద్రబాబు అరెస్ట్ ని ఖండించాలి. వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు కురిపించాలి

By:  Tupaki Desk   |   19 Sep 2023 10:39 AM GMT
జూనియర్ నోటి వెంట ఆ మాట.... తమ్ముళ్ళ తహ తహ
X

జూనియర్ ఎన్టీయార్ అర్జంటుగా చంద్రబాబు అరెస్ట్ ని ఖండించాలి. వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు కురిపించాలి. మామకు జరిగిన అన్యాయం మీద అల్లుడు ఆగ్రహం వ్యక్తం చేయాలి. టీడీపీకి నేనున్నాను అని అండదండలు ఇవ్వాలి.

ఇదంతా తమ్ముళ్ల ఆశలు, ఆలోచనలు. అయితే జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఎక్కడా నోరు విప్పడంలేదు నిజానికి చంద్రబాబు అరెస్ట్ జరిగి ఇప్పటికి పదకొండు రోజులు పూర్తి అయింది. చెప్పాల్సిన వారు, ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు అంతా సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు.

ఎన్టీయార్ కుటుంబం కూడా బాగానే రియాక్ట్ అయింది. డే వన్ నుంచే రంగంలోకి దిగింది బాబుకు బాసటగా నిలిచింది. అయితే ఒక్క జూనియర్ ఎన్టీయార్ నుంచి మాత్రమే స్పందన లేదు. దాని మీద టీడీపీలో చాలా మంది ఎదురుచూస్తూ వచ్చారు ఆ తరువాత విషయం బోధపడి ఏమీ అనకుండా ఉన్నారు.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే జూనియర్ ఎన్టీయార్ బాబు అరెస్ట్ ని ఎందుకు ఖండించలేదు అంటే పోయి ఆయన్నే అడుగు అని ఆ విలేకరికి క్లాస్ తీసుకున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఇదే విషయం మీద అడిగితే ఆయన జూనియర్ ఎపుడూ పెద్దగా రియాక్ట్ కారు కదా. ఇదే అంతే అని లైట్ తీసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం క్యాడర్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ రచ్చ అలా కంటిన్యూస్ గా సాగుతూనే ఉంది. జూనియర్ దుబాయ్ వెళ్లారు, సైమా తరఫున ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడింది చూస్తే తనకు అభిమానులే అసలైన బలం అన్నారు. వారికే తాను కృతజ్ణుడిని అన్నారు. దాని మీద కూడా రచ్చ జరిగింది.

ఇపుడు జూనియర్ ఎన్టీయార్ దుబాయ్ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఆయన మరికొద్ది రోజులలో తిరిగి దేవర మూవీ షూటింగులో పాల్గొంటారు అని అంటున్నారు. అయితే జూనియర్ దుబాయ్ నుంచి వచ్చారు కాబట్టి బాబు అరెస్ట్ మీద ఆయన మాట్లాడుతారు అని తమ్ముళ్ళు మరోసారి ఆశలు పెంచుకుంటున్నారు. అసలు దుబాయ్ టూర్ కి ముందు కూడా జూనియర్ పెదవి విప్పలేదు, దుబాయ్ నుంచి వచ్చి ఎందుకు మాట్లాడుతారు అని అంతా అంటున్నారు.

నిజానికి జూనియర్ కి రాజకీయాల మీద అసలు అసక్తి అయితే లేదు అంటున్నారు. ఆయన తన సినిమాలు తాను అన్నట్లుగా ఉంటున్నారు. ఎన్టీయార్ కుటుంబంతో కూడా ఆయన కేవలం ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ మేరకే ఉంటున్నారు. అంతకు మించి ఆయన ఎక్కడా ముందుకు వెళ్ళడంలేదు.

జూనియర్ కి రాజకీయాలు అంటే ఇప్పట్లో ఇష్టం లేదు అని అంటున్నారు. పైగా అయన గ్లోబర్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఆ ఫోకస్ అంతా అక్కడే పెట్టారని అంటున్నారు. అందువల్ల ఎవరు ఏమనుకున్నా ఆయన ఆలోచనలు వేరు అని అంటున్నారు. జూనియర్ నోరు విప్పి బాబు అరెస్ట్ మీద రియాక్ట్ అవుతారు అని ఒకవేళ అనుకున్నా ఆయన ఇపుడు స్పందిస్తే ఇంత లేటుగానా అన్న వారూ ఉంటారు.

అలాగే మీరు మేము చెప్పినట్లుగా మాకు కావాల్సినట్లుగా రియాక్ట్ కాలేదు అని కూడా సాగదీసి దాని మీద కొత్త చర్చలు పెడతారు. అసలు ఇదంతా అవసరమా అనుకునే జూనియర్ నో పాలిటిక్స్ అనేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జూనియర్ పెదవి విప్పితే చూడాలని తమ్ముళ్లకు ఉంది కానీ జూనియర్ పెదవి విప్పుతారా అన్నదే మ్యాటర్.