జగన్ దేవుడంటూ...ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలలో సహచరులతో మాట్లాడుతూ జగన్ తనకు దేవుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 15 Feb 2026 9:28 AM ISTకైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలలో సహచరులతో మాట్లాడుతూ జగన్ తనకు దేవుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెల్లవారుతూనే ఆయన ఫోటోకే దండం పెట్టుకుంటాను అన్నారు రాజకీయాల్లోకి వచ్చి తాను ఇబ్బంది పడుతున్న వేళ ఆయన తనకు అవకాశం ఇచ్చారని కూడా చెప్పుకున్నారు. ఇంతకీ ఈ జయమంగళ వెంకటరమణ అంటున్న మాటల వెనక సంకేతాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
టీడీపీ నేతగా :
జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయనకు పార్టీ 2009, 20119లలో రెండు సార్లు టికెట్ ఇచ్చింది. అయితే ఆయన 2009లో గెలిచారు. 2019లో ఓడారు. 2014లో తనకు టికెట్ ఇచ్చి ఉంటే మంత్రి అయ్యేవాడిని అని కూడా తాజా కామెంట్స్ లో చెప్పారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కి ఇచ్చారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. ఇక వైసీపీ నుంచి ఆయన జనసేనలో చేరడానికి ప్రయత్నం చేస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే చైర్మన్ ఆయన రాజీనామా ఆమోదించలేదు, దీని మీద న్యాయ స్థానానికి వెళ్లారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూటమి వైపు నుంచి వెనక్కి మళ్ళుతున్నారా అన్న చర్చ సాగుతోంది అంటున్నారు.
ఇమడలేకనా :
వైసీపీ ఓటమి చెందగానే చాలా మంది నేతలు పార్టీలు మారారు. అనేక మంది నేతలు కూటమి వైపుగా చూశారు. తమకు ఇచ్చిన పదవులను సైతం వదులుకున్నారు. అలా ఎమ్మెల్సీలు అయిదుగురు దాకా ఇదే బాటన సాగారు, కానీ మండలి చైర్మన్ వైసీపీ వారు కావడంతో అక్కడ వారి రాజీనామాలు నిలిచిపోయాయి. ఇంకో వైపు చూస్తే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. చాలా మందికి అవకాశాలు దక్కక ఉన్నారు. అంతే కాదు వైసీపీ నుంచి ఎవరు వచ్చినా తీసుకోవడానికి అయితే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు, ఒకవేళ తీసుకున్నా వారికి సరైన ప్రాధాన్యత లేదని అంటున్నారు.
ఆమె సైతం అలా :
ఇక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు మళ్ళారు, కానీ ఆమెకు పార్టీలో ప్రాధాన్యత లేదని ఆమె వర్గం అంటోంది. దాంతో ఆమె కూడా ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. 2023లో గవర్నర్ కోటాలో ఆమెకు సీటు దక్కింది. ఇప్పటికి మూడేళ్ళ పదవీ కాలం పూర్తి అయింది. మరో మూడేళ్ళలో అంటే 2029 లో టెర్మ్ కంప్లీట్ అవుతుంది. గోదావరి జిల్లాల రాజకీయాల్లో కూటమి పార్టీలలో ఆమెకు పొలిటికల్ గా అకామిడేషన్ దక్కడం కష్టమని అంటున్నారు. దాంతో ఆమె కూడా వైసీపీ వైపు చూస్తున్నారా అన్న చర్చ సాగుతోందిట.
డోర్స్ ఓపెన్ నా ;
అనేక మంది నేతలు తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారు అని అంటున్నారు. కానీ వైసీపీలో డోర్స్ ఓపెన్ చేస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది. వైసీపీలో అయితే జగన్ వరకూ నో చెబుతారనే అంటున్నారు. ఒకసారి పార్టీని వీడితే ఎంతటి పెద్ద వారు అయినా తిరిగి తీసుకోవడం జరిగేది కాదని అంటున్నారు. పైగా ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు కష్టపడిన వారికే అవకాశాలు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాలు తమాషాగా సాగుతున్నాయి. అటూ ఇటూ రెండు శిబిరాలే ఉండడం వల్ల ఆశావహులకు అవకాశాలు అయితే పెద్దగా లేకపోతున్నాయని అంటున్నారు.
