జంగాకు చంద్రబాబు అభయం.. !
గత ఎన్నికలకు ముందు వినుకొండ టికెట్ దక్కకపోవడంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగాకు చంద్రబాబు తర్వాత కాలంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.
By: Garuda Media | 25 Feb 2026 1:00 AM ISTఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి సీఎం చంద్రబాబు అభయం ఇచ్చారా? త్వరలోనే నామినేటెడ్ పదవికి ఆయనను సిఫారసు చేయనున్నారా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వినుకొండ టికెట్ దక్కకపోవడంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగాకు చంద్రబాబు తర్వాత కాలంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే.. వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇటీవల ఈ పదవిని వదులుకున్నారు.
దీంతో జంగా వర్గం అసంతృప్తిలో ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగాకి.. కీలకమైన పోస్టు ఇవ్వాలంటూ.. ఇటీవల యాదవ సామాజిక వర్గం కూడా డిమాండ్ చేయడం గమనార్హం. అంతేకాదు.. తిరిగి ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పంపించాలని పలువురు యాదవ నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబును జంగా కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు. అదే సయమంలో నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కూడా ఆయన వివరించారు. ఈ క్రమంలోనే త్వరలో నే నామినేటెడ్ పదవిని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు జంగా తన వర్గానికి సమాచారం ఇచ్చారు. అయితే.. జంగా ఆశలు మాత్రం మరోసారి ఎమ్మెల్సీ పీఠంపైనే ఉన్నాయి. గతంలోనే ఆయనకు చంద్రబాబు హామీ ఇచ్చారన్న చర్చ కూడా నడిచింది.
ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్సీలు.. రాజీనామాలు చేశారు. అయినా.. వారి రాజీనామాలను చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. దీంతో సదరు ఎమ్మెల్సీలు సభకు వెళ్తున్నారు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే తప్ప.. ప్రస్తుతం మండలిలో సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ ఖాళీ అయితే.. అప్పుడు మాత్రమే జంగాకు అవకాశం లభించే ఛాన్స్ ఉంటుంది. ఆయనతో పాటు మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
