జనసేనకు అధికార ప్రతినిధులు ఎందరో...?
అయితే ఈ అభిమానాలూ మద్దతూ ఎల్లకాలం నిలుస్తాయా అన్నదే జనసేన ఒకసారి ఆలోచించుకోవాలని అంటున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2023 5:57 PM ISTఏపీలో జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు అయింది. సంస్థాగతంగా ఆ పార్టీ ఇంకా పటిష్టం కావాల్సి ఉందని అంటారు. ఇక పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తప్ప ఆ పార్టీలో కీలక నేతలు కూడా పెద్దగా కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు ఒక్కడు చాలు అన్నట్లుగా ఆయనకు ఉన్న సినీ గ్లామర్ తో పాటు ఒక బలమైన సామాజిక వర్గం నేపధ్యంతో ఆయన ఏపీలో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ మీదనే తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు.
నిజానికి ఏపీలో తెలుగుదేశం పార్టీ విపక్షంగా ఉంది. కానీ పవన్ మాత్రం బలమైన విపక్షంగా మారుతున్నారు. దానికి కారణం ఆయనకు ఉన్న గ్లామర్. ఇదిలా ఉంటే ఏపీలో అధికార వైసీపీ కూడా పవన్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పవన్ విమర్శ చేస్తే ప్రతిగా వైసీపీ నుంచి పదుల సంఖ్యలో ప్రతి విమర్శలు వచ్చి పడుతున్నాయి.
అయితే వాటిని తిప్పికొట్టాలంటే మళ్లీ పవన్ కళ్యాణే రంగంలోకి రావాల్సి ఉంటోంది. లేకపోతే నాదెండ్ల మనోహర్ వంటి వారే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే పవన్ కి ఆ బాధ ఏమీ లేకుండా చాలా మంది జనసేనకు అధికార పార్టీ ప్రతినిధులుగా అవతారం ఎత్తేస్తున్నారు. ఒక రెబెల్ ఎంపీ అయితే పవన్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారు.
ఆయన పవన్ని ఎవరైనా ఏమైనా అంటే చాలు ఆ వెంటనే గట్టి రిటార్ట్ ఇచ్చేస్తారు. అంతే కాదు వైసీపీని చీల్చిచెండాడే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా జనసేనలో ఫుల్ ఆనందాన్ని నింపుతున్నారు. అదే విధంగా పొత్తులు అంటే లేవు కానీ తెలుగుదేశం పార్టీ సైతం జనసేనకు మిత్రపక్షంగా ఉంటూ మాట సాయం చేస్తూ ఉంటుంది.
కొన్ని తీవ్ర విమర్శలు జనసేన మీద వైసీపీ చేసినపుడు ఏకంగా చంద్రబాబు నుంచే రియాక్షన్ వస్తోంది. అలాగే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఇతర కీలక నేతలు కూడా పవన్ని అన్నేసి మాటలు అంటారా అని వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
దాంతో జనసేనకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారు అనిపించకమానదు. ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా పవన్ వైసీపీ మీద చేస్తున్న కామెంట్స్ ని తమ మీడియా ద్వారా ఎప్పటికపుడు హైలెట్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు పవన్ని ఎవరైనా ఏమైనా అంటే తమదైన విమర్శలు చేస్తూ వస్తునారు. ఇది నిజంగా వైసీపీకి తలనొప్పిగా మారితే జనసేనకు చాలా సుఖంగా ఉంటోంది.
ఎందుకంటే తాము నోరెత్తకుండా తమ పక్షాన చాలా మంది నిలిచి గెలిపిస్తూంటే ఆ పార్టీకి ఆయాసం ఆరాటాలు తీరిపోతాయి కదా. సో జనసేనకు అదన్న మాట బలం. నిజంగా ఏ పార్టీ అయినా తన మీద వచ్చిన విమర్శలకు తానే సమాధానం చెప్పుకోవాలి. కానీ జనసేనకు ఉన్న అదృష్టం ఇదే అనుకోవాలి. అందువల్లనే జనసేన వాయిస్ కేవలం ఆ పార్టీ పరిధి పరిమితుల నుంచి కాకుండా ఇంకా బలంగా మారుతోంది అని అంటున్నారు.
అయితే ఈ అభిమానాలూ మద్దతూ ఎల్లకాలం నిలుస్తాయా అన్నదే జనసేన ఒకసారి ఆలోచించుకోవాలని అంటున్నారు. ఎందుకంటే ఇది ఫక్తు రాజకీయం. అందువల్ల ఎవరు ఎపుడు ఏ వైపునకు మొగ్గుతారో, ఈ రోజు పొగిడి వెనకేసుకొచ్చిన నోళ్ళు, మీడియా మద్దతు ఎల్లకాలం ఉంటాయా అంటే ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇదే రాజకీయం కాబట్టి.
