Begin typing your search above and press return to search.

ఇంత చూశాక జనసైనికులు కూల్ అవుతారా...?

ఆ సీట్లు అన్నీ కూడా టీడీపీకి పట్టు ఉన్నవే. అందుకే కేవలం అయిదుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:50 AM GMT
ఇంత చూశాక జనసైనికులు కూల్ అవుతారా...?
X

జనసేనకు 24 సీట్లు మాత్రమే పొత్తులో కేటాయించడంతో మరీ ఇంత లైట్ గా తీసుకుంటారా అని జనసైనికులు ఎక్కడికక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లకే ఎలా ఒప్పుకుంటారు అని కూడా కాపు నేతలు మండిపడుతున్నారు. ఇది గౌరవప్రదమైన పొత్తు కాదు అని డిమాండ్ చేసి తీసుకోవాల్సిన చోట ఇంత తక్కువ నంబర్ కి అంగీకరించడం సబబు కాదు అని అంటున్నారు.

అయితే జనసేన కూడా అదనపు సీట్ల కోసం ప్రయత్నం చేస్తోందని టాక్ అయితే నడుస్తోంది. ఎందుకంటే క్యాడర్ కి సర్ది చెప్పుకోవాలని చూసినా అసలు కుదిరేది కాదు అని అంటున్నారు. కాపు సామాజిక వర్గం అయితే దీని మీద పెద్ద ఎత్తున మండిపోతోంది. అయితే టీడీపీ జనసేనకు 24 సీట్లు కేటాయిస్తేనే పెద్ద ఎత్తున టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

ఆ సీట్లు అన్నీ కూడా టీడీపీకి పట్టు ఉన్నవే. అందుకే కేవలం అయిదుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన చోట్ల ఇబ్బందులు అన్నీ సర్దుకున్నాకనే ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇపుడు దానికి తోడు మరో పది సీట్లు అంటే ఇస్తారా అన్నదే చర్చగా ఉంది.

దీని మీద జనసేన పెద్దలు ఎవరూ స్పందించడంలేదు కానీ ఆ పార్టీలో కొత్తగా చేరిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ మాత్రం తనదైన శైలిలో కీలక కామెంట్స్ చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు మరో పది సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ కోసం కొన్ని సీట్లు ఆపారని ఆ సీట్లు జనసేనకే ఇస్తారు అని ఆయన కొత్త మాట చెప్పుకొచ్చారు.

అయితే అది వాస్తవంలో జరిగేనా అన్నదే ప్రశ్నగా ఉంది. ఎందుకంటే బీజేపీకి ఇచ్చే టికెట్లు కూడా వేరేవి ఉండవు, అవి కూడా టీడీపీ నుంచే ఇవ్వాలి. ఇప్పటికే ఇరవై నాలుగు సీట్లు కోత పడిందని ఆ పార్టీ నేతలు గొడవ చేస్తున్నారు. దానికి కొత్తగా మరిన్ని ఇస్తే కనుక ఇంకా టీడీపీలో రచ్చ జరుగుతుంది అని అంటున్నారు.

అయితే జనసేన అనుచరులు అభిమానులు ఇపుడు మండిపోతున్నారు కాబట్టి వారిని కూల్ చేసేందుకే ఈ రకమైన ప్రకటన కొణతాల వంటి వారి ద్వారా ఇప్పించారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి అదే నిజమైతే పార్టీ పెద్దలు ప్రకటించి ఉండేవారు కదా అని అంటున్నారు.

అంత వరకూ ఎందుకు చంద్రబాబే తొలి విడత జాబితా విడుదల సందర్భంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు అని అదే ఫైనల్ అన్నట్లుగా చెప్పేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే జనసేనకు మరో పది సీట్లు ఎక్కడ నుంచి ఇస్తారు అన్నది చర్చగా ఉంది.