Begin typing your search above and press return to search.

నిండా నిరాశలో జనసైన్యం...సేనానికి పెను సవాల్...!

జనసేనలో ఇపుడు నిండా నిరాశ కంపిస్తోంది. దీనిని ఎలా చెప్పాలంటే నిరాశకు అయినా హద్దు ఉండాలి కదా అని

By:  Tupaki Desk   |   12 March 2024 3:30 PM GMT
నిండా నిరాశలో జనసైన్యం...సేనానికి పెను సవాల్...!
X

జనసేనలో ఇపుడు నిండా నిరాశ కంపిస్తోంది. దీనిని ఎలా చెప్పాలంటే నిరాశకు అయినా హద్దు ఉండాలి కదా అని. ఆశకు హద్దు ఉండాలి అని సాధారణంగా అంటారు. మరీ అత్యాశ పడకూడదు, కానీ నిండా నిరాశలో కూడా మునగరాదు కదా. ఇంతన్నాడు అంతన్నాడు గంగరాజు అన్నట్లుగా ఎక్కడో డెబ్బై నుంచి ఎనభై సీట్లను ఊహించిన క్యాడర్ కి ఇపుడు ఇచ్చిన 24 సీట్లలోనే భారీ కోత పడుతూంటే తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఎలా ఉందో కానీ సైన్యం మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. ఒక విధంగా వారు నామోషీగా భావిస్తున్నారు. పార్టీ ఇమేజ్ పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మరీ తెగ బాధ పడిపోతున్నారు. అంతే కాదు అత్త తిట్టింది అని కాదు తోడి కోడలు నవ్వింది అన్న మాదిరిగా నిన్నటిదాకా వైసీపీ మీద సవాల్ చేసి ఇపుడు జస్ట్ 20 సీట్లు తీసుకుంటూ ఇంకా సరి పుచ్చుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ ఉన్న చోట నుంచి వేరే చోటకు కదులుతూ అది కూడా పోటీ రోజు వరకూ గ్యారంటీగా ఉంటుందా లేదా అని భావిస్తూ అనుమానిస్తూ అభద్రతా భావంతో ఉంటూ సైన్యం పడుతున్న మనస్తాపం వర్ణనాతీతం.

గౌరవప్రదమైన పొత్తు అంటే ఇదేనా ఈ నంబర్ ని చూసి మురిసిపోవాలా అని సైన్యం ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తోంది. అవును నిజమే జగన్ ని గద్దె దించాల్సిందే. కానీ దానికి జనసేన మాత్రమే సమిధ కావాలా అన్న ప్రశ్నలు కూడా వారి నుంచి వస్తున్నాయి. ఇలాగైతే ఎలా సేనానీ అని పవన్ మీద గుర్రు మంటున్నారు. ఇది ఇజ్జత్ మే సవాల్ కదా అని అంటున్నారు.

తక్కువలో తక్కువ నలభై దాకా సీట్లు ఆశించామని కానీ అది కాస్తా 24 అయింది దాన్ని కూడా పోనీ అని పంటి బిగువున బాధను దాచుకుని సరిపెట్టుకుంటూంటే ఇపుడు మరో మూడు సీట్లు పోవడం అంటే ఎలా అని సైన్యం ప్రశ్నిస్తున్నారు.

ఇంకెన్ని త్యాగాలు చేయాలని కూడా వారు నిలదీస్తున్నారు. మన బలాన్ని మనమే తగ్గించుకుంటే ఎలా పవన్ సారూ అని అంటున్నారు. మన బలం తక్కువ చేసుకోవడం రాజనీతి ఎలా అవుతుంది అన్నది కూడా వారు లేవదీస్తున్న మరో పాయింట్. ఒక విధంగా చెప్పాలీ అంటే జనసైనికులు రగిలిపోతున్నారు. మా వల్ల కాదు అంటున్నారు.

త్యాగాల కోసం పార్టీ అన్నది ఎక్కడా చూడలేదు అంటున్నారు. త్యాగాలు చేయడానికి మఠాలు సత్రాలు పీఠాలు ఉన్నాయి కానీ ఇది ఫక్తు రాజకీయమని ఇక్కడ అడిగి మరీ తీసుకోవాలి కానీ ఉన్నది వదిలేసుకుంటూ త్యాగం అని ముద్దు పేరు పెట్టుకుంటూ పోతే రాజకీయ పార్టీగా ముందుకు సాగేది ఏలా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఒక మాట అనుకున్నాక 24 ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు అని ప్రకటించాక వాటిలో కూడా మనమే త్యాగాలు చేయాలా అన్నది జనసైనికుల నుంచి వస్తున్న సూటి ప్రశ్నగా ఉంది. ఒక విధంగా చూస్తే గత రెండు రోజులుగా నెట్టింట జనసైనికుల ఆవేదన రోదన నైరాశ్యం అన్నీ కూడా అక్కడ కనిపిస్తునాయి.

ఇంతా చేసి మనం ఏమి సాధించినట్లు అన్నది కూడా వారిని పట్టి పీడిస్తున్న ప్రశ్నగా ఉంది. అదే అతి పెద్ద సందేహంగా మారుతోంద్. పవన్ చెబుతున్న మాటలు కానీ స్వాంత వచనాలు కానీ జగన్ ని విలన్ గా చూపించి మనం తగ్గిపోవాలి వైసీపీని ఓడించాలి అని అంటున్న మాటలు కానీ ఈ దశలో ఈ స్థితిలో వారిని ఏ మాత్రం ఓదార్చేలా లేవని అంటున్నారు.

నిజంగా చూస్తే కనుక జనసైనికులు పవన్ ని బాగా నమ్మారు. ఆయన చెప్పిన దాన్ని పూర్తిగా విశ్వసించారు. ఇపుడు తమ ఓపికకు పరీక్ష పెడుతున్నారా అన్న డౌట్లు వారికి వచ్చేస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదు అని వారు అంటున్నారు. ఎన్నికల ముందు యుద్ధ భూమిలో అడుగుపెడుతున్న వేళ సరిగ్గా ఈ కీలక సమయంలో జనసైనికుల నైరాశ్యం జనసేనను ఏ మాత్రం మంచిది కాదు అని అంటున్నారు. వారిని బుజ్జగించి దారిన పెట్టి ఎన్నికల సమరంలోకి ఉత్సాహంగా నడిపించడం సేనానికి పెను సవాల్ అని అంటున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా ఎంతలా చెప్పినా కూడా జనసైనికులు వింటారా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వారి దృష్టిలో పవన్ హీరో. ఆయన సీఎం కావాలి. ఇపుడు చూస్తూంటే ఆ పరిణామాలు ఏవీ కనిపించడంలేదు దాంతో వారికి నిండా దిగులు ఆవహిస్తోంది. మరి పవన్ పొత్తులతో టీడీపీ బీజేపీ వద్ద త్యాగాలతో మనసు చూరగొంటున్నారు, కానీ పార్టీకి ప్రాణం పెట్టే సైనికులను ఏ దిశగా నచ్చచెప్పి ముందుకు నడిపిస్తారు అన్నది మాత్రం చూడాల్సి ఉంది.