Begin typing your search above and press return to search.

టికెట్ ఇవ్వలేదు సరే.. ఓదార్పు కూడా లేకుంటే ఎలా పవన్?

ఇప్పుడో పెద్ద ప్రశ్న ఏపీలో నడుస్తోంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేన నేతలు.. కార్యకర్తలు కాస్త డిఫరెంట్ అని

By:  Tupaki Desk   |   12 April 2024 5:46 AM GMT
టికెట్ ఇవ్వలేదు సరే.. ఓదార్పు కూడా లేకుంటే ఎలా పవన్?
X

ఇప్పుడో పెద్ద ప్రశ్న ఏపీలో నడుస్తోంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేన నేతలు.. కార్యకర్తలు కాస్త డిఫరెంట్ అని. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేన ద్వితీయశ్రేణి నేతలు.. కార్యకర్తలు ఒకలాంటి భిన్నమైన తీరుతో ఉండటం కనిపిస్తుంది. మిగిలిన రాజకీయపార్టీల్లో కింది స్థాయి కార్యకర్తల్లో మధ్యవయస్కులు ఎక్కువగా ఉంటారు.కానీ.. జనసేనలో మాత్రం యూత్ ఫోర్సు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. చదువుకున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువే. అదే మిగిలిన పార్టీలకు జనసేనకు భిన్నంగా నిలుపుతుంది.

తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆశపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని.. తమ సత్తా చాటుతామని భావించారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. గెలుపు మాత్రమే ముఖ్యం కావటంతో కాస్త సర్దుకోవాలన్న విషయాన్ని జనసేన నేతలు.. కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. అయితే.. జనసేనాని పవన్ కల్యాణ్ తీరుపై మాత్రం వారు ఇబ్బందికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు.

తన బలం జనసేన కార్యకర్తలని తరచూ చెప్పుకునే పవన్ కల్యాణ్.. అందరిని కాకున్నా కొందరిని అయినా సరే.. పలుకరించటం.. పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన వారి విషయంలో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైన పలువురు నేతలు.. పొత్తు కారణాలతో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు.. ఆ విషయాన్ని సదరు నేతను ప్రైవేటుగా పిలిపించి.. విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తానన్న హామీ ఇవ్వటం సాధారణంగా జరుగుతుంది.

కానీ.. ఈ విషయంలో పవన్ తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్ల తరబడి పార్టీ కోసం భారీగా ఖర్చులు చేసి.. పార్టీ బతకటం కోసం అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలిచిన వారిని గుర్తించి.. వారికి ‘నేనున్నాను’ అన్న భరోసాతో పాటు.. మీ బాగోగుల గురించి తాను చూసుకుంటానన్న నమ్మకాన్ని ఇవ్వాల్సిన కనీస బాద్యత లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల వేళలో టికెట్లు అందరికి ఇవ్వటం సాధ్యం కాదు. ఈ ఇబ్బంది అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది.

కానీ.. టికెట్ రేసులో నిలిచి.. టికెట్ దక్కని వారిని దగ్గరకు పిలిపించుకొని పార్టీ గెలుపు కోసం పోరాడాలని.. తాను వారికి అండగా ఉంటానని చెప్పటంతో పాటు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి గుర్తింపు ఖాయమన్న భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ చేయకుండా తన మానాన తాను ఉండిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన బానిససేన ఎంత మాత్రం కాదంటున్నారు. పార్టీకోసం శ్రమించిన వారిని పార్టీ అధినేతగా గుర్తించకపోవటం మంచి పద్దతి కాదని.. ఇదే తీరును కంటిన్యూ చేస్తే ఎన్నికల్లో షాకులు తగలటం ఖాయమంటున్నారు. ఇప్పటికైనా జనసేనాని వాస్తవాల్ని గుర్తించి.. పార్టీ కోసం శ్రమించే వారిని కలిచి.. వారిని ఓదార్చటం.. బుజ్జగించటం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ అంశం పవన్ వరకు ఎప్పటికి వెళుతుందో చూడాలి.