సింగిల్ గానే జనసేన...పవన్ సీఎం కావాలి...!
2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీకి దిగాలని ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు అంతా తీర్మానించారు.
By: Tupaki Desk | 21 Sep 2023 7:23 AM GMTజనసేన పుట్టాక పెట్టాక సరైన అల్టిమేటమే పవన్ కి బలమైన సామాజికవర్గం నుంచి వచ్చింది. ఏపీలో గట్టిగా ఉన్న కాపు సామాజికవర్గం జనసేనను అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా సరైన ఆల్టర్నేషన్ గా చూస్తోంది. అలాగే చంద్రబాబు, జగన్ సీఎంలు అయినపుడు మూడవ చాన్స్ విభజన ఏపీలో పవన్ కే దక్కాలన్నది వారి వాదన, పట్టుదల.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బలమైన సామాజికవర్గం మనోభావాలకు భిన్నంగా నడచుకుంటున్నారా అన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. పవన్ సీఎం అని కాపు సామాజికవర్గం ఆశలు పెట్టుకుంటూంటే పవన్ మాత్రం జగన్ గద్దె దిగాలి అని ఒక సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు పోతున్నారు అని అంటున్నారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు, జగన్ సీఎం కాకూడదు ఇలాంటి స్లోగన్స్ తో పవన్ తనకు దక్కాల్సిన కాపులకు చిరకాల వాంచ అయిన సీఎం పదవి విషయంలో మాత్రం మాట్లాడకుండా రాజకీయం చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పవన్ కుండబద్ధలు కొట్టేసారు. గత గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని కలసి బయటకు వచ్చిన వెంటనే పవన్ టీడీపీతో కలసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పడం విశేషం.
దీని మీద ఆయన ఆ వెంటనే జనసేన మీటింగ్ పెట్టి మరీ పార్టీ నేతలకు టీడీపీతోనే వెళ్తామని సంకేతాలు ఇచ్చారు. వారిని కూడా కన్విన్స్ చేయగలిగారు. అయితే రాజకీయ విశ్లేషకుల డౌట్లు ఏంటి అంటే బలమైన కాపు సామాజికవర్గం ఏ విధంగా ఈ పొత్తుల మీద రియాక్ట్ అవుతుంది అని. ఆ డౌట్లకు తగిన విధంగానే కాకినాడలో తాజాగా జరిగిన చర్చా గోష్టిలో కాపు నేతలు అంతా పవన్ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించడం విశేషం.
ఈ భేటీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల నేతలు పాలుపంచుకోవడం గమనార్హం. అంటే పవన్ డెసిషన్ మీద ఆయన ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీకి దిగాలని ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు అంతా తీర్మానించారు.
ఏపీలో టీడీపీతో సహా మరే పార్టీతోనూ పొత్తులు వద్దే వద్దు అని కూడా తీర్మానించారు. అంటే పవన్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అది కూడా వద్దు అని వారు స్పష్టం చేశారు అన్న మాట. జనసేన 2019 నాటి కంటే కూడా ఇప్పటికీ ఏపీలో బలంగా ఉందని, గతంలో లేని విధంగా ప్రతీ గ్రామంలో జనసేన ఆఫీసులు ఉన్నాయని, కాపులలో కూడా చైతన్యం వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు.
ఈసారి పవన్ తప్పకుండా సీఎం అవుతారని అంతా భావిస్తున్న వేళ టీడీపీతో పొత్తు ప్రకటన రావడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తులు పెట్తుకుంటే జనసేన ఎప్పటికీ ఎదగలేదని, అలాగే పవన్ ఎప్పటికీ సీఎం కూడా కాలేరని వారు అంటున్నారు.
ఇక టీడీపీతో జనసేన పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారు తప్ప పవన్ ఎలా అవుతారు అని లాజిక్ పాయింట్ నే వారు లేవదీయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే కాపులంతా కలసి ఆయన్ని సీఎం గా చేస్తారని కూడా అంటున్నారు.]ఇక ఏపీలో తాము 2024 తరువాత పవన్ సీఎం గా చూడాలని అనుకుంటున్నాం తప్ప చంద్రబాబుని కానే కాదని కాపులు తేల్చి చెప్పారు
అలా కాకుండా పవన్ తన ఇష్టం వచ్చినట్లుగా పొత్తులు పెట్టుకుంటామని అనంటే మాత్రం కాపులు కూడా వేరేగా ఆలోచిస్తారని అంటున్నారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో పూర్తిగా విజయవంతం అయిందని, దాని వెనక కాపు సామాజికవర్గం మాత్రమే కాకుండా ఇతర సామాజిక వర్గాలు కూడా జనసేన పట్ల ఆకర్షితులు కావడమే అని వారు అంటున్నారు. ముఖ్యంగా యువత జనసేన పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతోందని వారు చెప్పుకొచ్చారు.
కాపులంతా పవన్ని కోరుకుంటున్న వేళ సీఎం గా తమ సామాజికవర్గం వారు ఉండాలని భావిస్తున్న వేళ పవన్ పొత్తులకు వెళ్తే కనుక ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఇపుడు కాకపోతే కాపులకు ఎప్పటికీ చాన్స్ రాదని కూడా గుర్తు పెట్టుకోవాలని పవన్ కి వారు సూచించారు. కాపు సామాజికవర్గం మనోభావాలను పవన్ గౌరవించాలని వారు కోరుతున్నారు.
మొత్తం మీద చూస్తే కాపుల మనోభావాలు అభిప్రాయాలు స్పష్టంగానే ఉన్నాయి. 2024లో పవన్ సీఎం కావాలని వారు అంటున్నారు. పొత్తులు వద్దు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఆయన పార్టీ ఇబ్బందులు అవి వారి కష్టం. జనసేన తానుగా ఈ కీలక టైం లో రాజకీయంగా వాక్యూం ఉంటే దాన్ని తీసుకుని మరీ గట్టిగా బలపడాలని కోరుకుంటున్నారు.
అంతే తప్ప పక్క పార్టీలకు కొమ్ము కాసి వారిని ముఖ్యమంత్రులుగా చేయాలని చూస్తే తాము సహకరించేలేదని సుతి మెత్తగానే అల్టిమేటం ఇచ్చేశారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏమంటారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా టీడీపీ జనసేన పొత్తు ప్రకటన చేసినంత ఈజీ కాదు, చాలా హర్డిల్స్ ఉంటాయని అంతా ఊహిస్తున్నారు. దానికి తగినట్లుగానే ఇపుడు కాపుల రియాక్షన్ ఉంది అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.