Begin typing your search above and press return to search.

పవన్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

పోయిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన వారిలో కొందరికి సుమారు 25 వేల ఓట్లు వచ్చాయి

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:59 AM GMT
పవన్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్టీ నేతలు ఒత్తిళ్ళు పెంచేస్తున్నారట. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలోనే అని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని కొందరు నేతలు పదేపదే పవన్ కు చెబుతున్నారట. ఒకవేళ పొత్తుంటే చాలాసీట్లు కోల్పోవాల్సుంటుందని అపుడు పోటీకి తమకు అవకాశం రాదన్న ఆందోళన జనసేన నేతల్లో పెరిగిపోతోందట. ఇలాంటి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల నుండే ఎక్కువగా ఉంటోందని పార్టీవర్గాల సమాచారం.

పోయిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన వారిలో కొందరికి సుమారు 25 వేల ఓట్లు వచ్చాయి. అలాంటి నేతలంతా పార్టీని వదిలేయకుండా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీచేయాలని, గెలవాలని మహా పట్టుదలగా పార్టీకోసం పనిచేస్తున్నారు. ఇపుడు పొత్తు వ్యవహారం అలాంటి చాలామంది నేతల్లో మింగుడుపడటంలేదు. కొత్తపేట, ముమ్మిడివరం, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, పీ గన్నవరం లాంటి చాలా నియోజకవర్గంలో ఇదే వ్యవహారం నడుస్తోందట.

రెండుపార్టీల మధ్య పొత్తుంటే పై నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం తెలుగుదేంపార్టీకి దక్కుతుందని జనసేన నేతలు టెన్షన్ పడుతున్నారట. దాదాపు నాలుగున్నరేళ్ళుగా తాము కష్టపడుతున్నామని, రాబోయే ఎన్నికల్లో పోటీచేయటమే లక్ష్యంగా కష్టపడటంతో పాటు భారీ ఎత్తున ఖర్చులు కూడా పెట్టుకున్నట్లు పవన్ కు చెబుతున్నారట. చివరి నిముషంలో పొత్తుల పేరుతో ఇపుడు సీట్లన్నీ టీడీపీకి ఇచ్చేస్తే తమ పరిస్ధితి ఏమిటని నిలదీస్తున్నారట. యాక్సెస్ ఉన్న నేతలు డైరెక్టుగా పవన్ తోనే మాట్లాడుతున్నారట. అది సాధ్యంకాని నేతలు పీఏసీ ఛైర్మన్, పవన్ రైట్ హ్యాండ్ గా ప్రచారంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తో చెప్పుకుంటున్నారట.

జనసేన ఒంటరిగా పోటీచేస్తే ఎవరికీ సమస్య ఉండదని, అలాకాదని పొత్తులు పెట్టుకుంటే పార్టీయే పోటీచేసేట్లుగా సీట్లను తీసుకోవాలని గట్టిగా చెబుతున్నారట. ఇవేవీ కాదంటే తాము ఇండిపెండెంటుగా అయినా పోటీకి రెడీగా ఉన్నట్లు చెబుతున్నారట. దాంతో ఏమిచేయాలో పార్టీ నాయకత్వానికి అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు వద్దని తమ్ముళ్ళు కూడా చంద్రబాబునాయుడుకు పదేపదే చెబుతున్నారు. ఒంటరిగా పోటీచేసినా గెలుపు గ్యారెంటీ అని చంద్రబాబుపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.