Begin typing your search above and press return to search.

జ‌న‌సేన ఆఫీసుల వ‌ద్ద‌.. ట‌పాసులు.. బోగి మంట‌లు.. రీజ‌నేంటి?

రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద బోగి మంట‌లు.. వేసి ట‌పాసులు కాల్చుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 8:34 PM IST
జ‌న‌సేన ఆఫీసుల వ‌ద్ద‌.. ట‌పాసులు.. బోగి మంట‌లు.. రీజ‌నేంటి?
X

రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద బోగి మంట‌లు.. వేసి ట‌పాసులు కాల్చుతున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో పార్టీ నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. దీనికి కార‌ణం.. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం పోయి.. కూట‌మి పార్టీల‌కు విజ‌యం ద‌క్కడ‌మే. 2024, జూన్ 4న రాష్ట్రంలో ఎన్నికల ఫ‌లి తం వ‌చ్చింది ఈ రోజే. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున `రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న` పీడ విర‌గ‌డైంద న్న నినాదంతో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

రెండు రోజుల కిందట జ‌న‌సేన పార్టీ పీఏసీచైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ఈ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. జూన్ 4 బుధ‌వారం నాడు.. ఉద‌యం బోగి మంట‌లు వేసి.. సంక్రాంతి జ‌రుపుకోవాల‌ని.. సాయంత్రం కార్యాల‌యాలు.. ఇళ్ల వ‌ద్ద ట‌పాసులు కాల్చి దీపావ‌ళి జ‌రుపుకోవాల‌ని సూచించారు. అంటే.. జూన్ 4న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి, సంక్రాంతి రెండూ క‌లిసి వ‌చ్చాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కులు .. బోగి మంట‌లు వేసి చ‌ప్ప‌ట్ల‌తో నూత‌న ప్ర‌భుత్వాన్ని అభినందిం చారు.

ఆయా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో కూడా పోస్టు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో జ‌న‌సేన‌నాయ‌కులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వైసీపీ పాల‌న‌పై కొంద‌రు నాయ‌కులు ప్ర‌సంగాలు చేశారు. గ‌త ఏడాది కాలంగా వ‌చ్చిన మార్పును కూడా వివ‌రించారు. వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాలు కూడా అత్యంత కీల‌క‌మ‌ని నాయ‌కులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌న‌సేన కార్యాల‌యాల వ‌ద్ద జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మాల‌కు భారీ స్పంద‌న వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.