Begin typing your search above and press return to search.

న‌గ‌రాల్లో సైన్యం లేని సేన పాలిటిక్స్‌.. !

రాష్ట్రవ్యాప్తంగా విస్త‌రించాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌కు.. వ్యూహాలు ఉన్నా.. వాటిని అమ‌లు చేసేందుకు బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల సంఖ్య త‌క్కువ‌గా ఉంది.

By:  Garuda Media   |   13 July 2026 9:00 PM IST
న‌గ‌రాల్లో సైన్యం లేని సేన పాలిటిక్స్‌.. !
X

రాష్ట్రవ్యాప్తంగా విస్త‌రించాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌కు.. వ్యూహాలు ఉన్నా.. వాటిని అమ‌లు చేసేందుకు బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల సంఖ్య త‌క్కువ‌గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విస్త‌రించేందుకు ప‌థ‌కాల‌ను న‌మ్ముకున్నా.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో విస్త‌రించేందుకు ఎలాంటి ప్ర‌ణాళిక‌లు లేకపోవ‌డం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముఖ్యంగా న‌గ‌రాల‌ను తీసుకుంటే.. జ‌న‌సేన ఊపు ఎక్కడా పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఉదాహ‌ర‌ణ‌కు.. పార్టీ కేంద్ర కార్యాల‌యం ఉన్న మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం స‌హా గుంటూరు, విజ‌య‌వాడ వంటి న‌గ‌రాల్లో జ‌న‌సేన జెండా మోసే నాయ‌కులు కానీ, కార్య‌క‌ర్త‌లు కానీ క‌నిపించ‌డం లేదు. నిజానికి రాజ‌కీయాల‌కు ఆయువు ప‌ట్టు వంటి విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన త‌ర‌ఫున బ‌లమైన నాయ‌కుడు లేకుండా పోయా రు. గ‌తంలో పోతిన మ‌హేష్ ఉన్నా.. ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నా.. అలాంటి నాయ‌కుడిని త‌యారు చేసుకోలేకపోయార‌న్న వాద‌న పార్టీలో ఉంది.

మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్యాల‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం మైన‌స్‌. మ‌రీ ముఖ్యంగా విశాఖ‌న‌గ‌రంలో పార్టీకి వంశీ కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు కేడ‌ర్ లేక‌పోవ‌డం విస్మ‌యం గొలుపుతుంది. వంశీకృష్ణ‌ పైనే ఆధార‌ప‌డుతున్న ప‌రిస్థితి కూడా పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీ కొంత మేర‌కు పుంజుకుంద‌ని చెబుతున్నా.. న‌గ‌రం విష‌యానికి వ‌స్తే.. జ‌న‌సేన త‌ర‌ఫు వాయిస్ వినిపించ‌డం లేదు.

గుంటూరు, క‌ర్నూలు, అనంత‌పురం.. న‌గ‌రాలు పెద్ద‌వి. ఇక్క‌డ ఓటు బ్యాంకు కూడా ఎక్కువ‌గానే ఉంది. అయితే.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే నాయ‌కుల లేక‌పోవ‌డం.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే నాయ‌కులు లేకపోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం తిరుప‌తిలో మాత్ర‌మే కిరణ్ రాయ‌ల్‌ వంటివారు బ‌లంగా ఉన్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రిలో పార్టీ కొంత ప్ర‌భావం చూపిస్తోంది. కానీ, రేపు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీ ఓటును పెంచే దిశ‌గా అడుగులు వేయాలంటే.. న‌గ‌రాల‌ను కూడా బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.